వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు ఆందోళనను విరమించేదిలేదని మధ్యాహ్న భోజనం చేయకుండా భీష్మించుకున్నారు. కాగితాలకే పరిమితమవుతున్నాయి కానీ.. సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులను నిలదీశారు. మెస్‌లో భోజనం సరిగాలేదని.. మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని ఎన్నిమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు.
దోస పిండిలో ఎలుకలు.. సాంబారులో కప్పలు ప్రత్యక్షమవుతున్నాయని సాక్ష్యాదారాలతో చూపించినా అధికారులలో చలనం లేకపోవడం బాధాకరమని తెలిపారు. ఆదివారం రాత్రి ట్రిపుల్ ఐటీలోని కెఎంకే క్యాటరింగ్‌కు చెందిన మెస్‌లో సాంబారులో కప్పలు ప్రత్యక్షమయ్యాయని విద్యార్థులు అధికారులకు స్వయంగా చూపించారు. ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ2, ఈ3 విద్యార్థులు ధర్నాకు దిగారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ధర్నాను కొనసాగించారు.
అధికారులు సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికి గతంలో ఇచ్చిన హామిలన్నీ నెరవేర్చితే కానీ ఆందోళనను విరమించమని తేల్చి చెప్పారు. యూనిఫాం, ష్యూస్, క్యాంపస్‌లో లైటింగ్, ఫ్యాకల్టీ, క్లీనింగ్, మెస్‌ల నిర్వహణ తదితర వాటిపై గతంలో వినతి పత్రాలు ఇచ్చామని.. ఏ ఒక్కటీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. జిల్లా అధికారులు దిగి వచ్చి హామీనిచ్చే వరకు రాజీపడే ప్రసక్తే లేదని భీష్మించుకకూర్చొన్నారు.
ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డిలు విద్యార్థులతో చర్చలు జరిపారు. సంబంధిత మెస్‌కు లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని.. సూపర్‌వైజర్‌ను తొలగిస్తామని హామీనిచ్చినప్పటికి విద్యార్థులు ధర్నాను విరమించే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. చర్చలు విఫలం కావడంతో ధర్నా యథావిధిగా కొనసాగింది.
కడపకు ర్యాలీ
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కేవీ రమణ దృష్టికి తీసుకెళ్లి తామే పరిష్కరించుకుంటామని వేలాది మంది విద్యార్థులు ర్యాలీగా ముందుకు సాగారు. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ట్రిపుల్ ఐటీ నుంచి పాదయాత్రగాకడపకు బయలుదేరారు. సాయంత్రం 6గంటలవరకు అక్కడ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేశారు. అధికారుల చర్చలు విఫలం కావడంతో కడపకు బయలుదేరారు. ఈ ర్యాలీ రాత్రి 7గంటలకు వీరన్నగట్టుపల్లె క్రాసింగ్ వద్దకు చేరుకుంది.
వీరన్నగట్టుపల్లె క్రాసింగ్ వద్ద ధర్నా
వేంపల్లె : తమ డిమాండ్ల సాధన కోసం ట్రిపుల్‌ఐటీ నుంచి ర్యాలీగా వెళుతున్న విద్యార్థులు చీకటి పడటంతో వీరన్నగట్టుపల్లె క్రాస్ వద్ద మరొకసారి ధర్నాకు దిగారు. కలెక్టర్ ఇక్కడికి రావాలని పట్టుబట్టారు. పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డి, వేంపల్లె ఎస్‌ఐ హాసంలతోపాటు పోలీసులు విద్యార్థులను కడపకు వెళ్లనీయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికి విద్యార్థులు ముందుకు సాగారు. కడప, రాయచోటి రోడ్డులలో బైఠాయించారు. ముందుగానే పోలీసు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రోడ్డెక్కిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
Published Tue, Mar 10 2015 2:19 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM
Advertisement
Advertisement