
డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీటీసీ రాజరత్నం పక్కన ఎంవీఐ శివనాగేశ్వరరావు తదితరులు
గుంటూరు: ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సూచించారు. నిబంధనలు పాటించే వాహన చోదకులకు గులాబీ పూలు, స్వీట్లు అందజేసి అభినందించాలన్నారు. అలా చేస్తే తోటి వాహనదారుల ఆలోచనా విధానంలో త్వరగా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులతో తన కార్యాలయంలో ఎస్పీ విజయరామారావు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాలను పటిష్టంగా కొనసాగించి ప్రజల్లో ట్రాఫిక్ నిబం ధనలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించాలని చెప్పారు. గుంటూరు నగర పరిధిలో ఇస్టానుసారంగా వాహనాలు నడుపుతున్న కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబం ధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయడంతో పాటు మైనర్లు నడిపే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించే వారిని ప్రోత్సహించడంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న ఘటనలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకు వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. అదనపు ఎస్పీలు వై.టి. నాయుడు, సుబ్బరాయుడు, డీఎస్పీలు సరిత, మూర్తి, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలి
నగరంపాలెం(గుంటూరు): సురక్షిత ప్రయాణానికి లారీ డ్రైవర్లు రహదారి భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలనీ జిల్లా ఉప రవాణా కమిషనర్ జి.సి.రాజరత్నం సూచిం చారు. 29వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆటోనగర్‌లోని లారీ యజమానుల సంఘ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై నిర్వహించిన సదస్సు డీటీసీ రాజరత్నం ప్రసంగించారు. గత ఏప్రిల్ నుంచి మార్చి చివరి నాటికి జిల్లాలో 592 రహదారి ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వాటిలో 372 ప్రమాదాలు లారీల కారణంగానే జరి గాయని వివరించారు. డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగం, ఓవర్‌లోడింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు జరుగుతాయని, నిబంధనలు పాటించిన డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎంవీఐ శివనాగేశ్వరరావు మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడితే ఏకగ్రత లోపించి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎంఎంవీఐ నాగలక్ష్మి మాట్లాడుతూ లారీ
డ్రైవర్లు అధిక శాతం మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని పేర్కొన్నారు. సదస్సు అనంతరం లారీ డ్రైవర్లుతో రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తామని రవాణా శాఖ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. లారీ యజ మానుల సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ట్రాఫిక్ సిబ్బందికి టోపీలు పంపిణీ
గుంటూరు: ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది వేసవిలో అప్రమత్తంగా వుంటూ విధులు నిర్వహించాలని రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పల నాయుడు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం తన కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి టోపీలు, కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ ఈ నెల 30 వరకు కొనసాగే వారోత్సవాల్లో హెల్మెట్ ప్రాముఖ్యత, డ్రవర్లకు, విద్యార్థులకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ లోడింగ్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్, అర్హులైన వారికి ఎల్ ఎల్ ఆర్ మేళాలను కొనాసాగిస్తామని వివరించారు. అదనపు ఎస్పీ వరదరాజు, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ హృదయరాజు పాల్గొన్నారు.