ఒక్కో నేరం ఒక్కో తీరు! | Roundup 2013 | Sakshi
Sakshi News home page

ఒక్కో నేరం ఒక్కో తీరు!

Published Sun, Dec 29 2013 2:15 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

Roundup 2013

=ఆర్థిక మోసాల నామ సంవత్సరం
 =గంజాయితో గుప్పుమన్న గ్రామీణ జిల్లా
 =కొత్త సవాల్ నకిలీ కరెన్సీ
 =కలవరపరిచే రీతిలో హత్యలు


నిర్దాక్షిణ్యంగా పీక నరికేయడం...కత్తితో పొట్టను తూట్లుతూట్లుగా పొడవడం...కసాయిహత్యలకు ఆనవాళ్లు. ఇప్పుడివి విశాఖ జిల్లాలో నిత్యకృత్యమైపోతున్నాయి. జల్సాలకు అలవాటుపడో..అడ్డదార్లో ఆస్తులు సంపాదించేయాలనో...లేదా పాత కక్షలతోనో కిరాతక హత్యలు చేసేవాళ్ల సంఖ్య రానురాను ఎక్కువైపోతుండడంతో 2013 భీతి గొలిపింది. ఇదంతా ఒకెత్తయితే... తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ ఆశచూపి అనేక ఫైనాన్స్ కంపెనీలు ఈ ఏడాదిలోనే జిల్లాలో రూ.925 కోట్లకుపైగా వసూలుచేసి అడ్డంగా బోర్డులు తిప్పేసి జనానికి టోపీ పెట్టాయి. ఇది కాక అడ్డదార్లో సంపాదించాలనుకునే అక్రమార్కులు గ్రామీణ జిల్లాను అక్రమ గంజాయి రవాణాకు అడ్డంగా వాడుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పేరు వినిపించింది. ఈ ఏడాది గంజాయి రవాణా రూ.100 కోట్లు దాటిపోయి పోలీసు శాఖకే సవాల్ విసిరింది. మరోపక్క నకిలీ కరెన్సీ చాపకింద నీరులా జిల్లా అంతటా విస్తరిస్తోంది. అవతారం ఎత్తడం.... ఇలా రకరకాల నేరాలతో విశాఖ ఉలిక్కిపడుతూనే ఉంది. ఈ నేరాల చిట్టా విప్పితే...ఇదిగో ఇలా ఉంది...!        
 
రూ.925 కోట్లకుపైగా ఫైనాన్స్ కంపెనీల కుచ్చుటోపీ

గడచిన ఏడాదంతా విశాఖకు ‘ఆర్థిక మోసాల నామ సంవత్సరమే’. తక్కువ పెట్టుబడితో ఎక్కువ వడ్డీ ఆశ చూపి వేలాదిమందిని పదుల సంఖ్యలో ఫైనాన్స్ కంపెనీలు నిట్టునిలువునా ముంచేశాయి. సిమ్స్, సురక్ష ఇన్‌ఫ్రా (5 కోట్లు),స్పార్క్, స్నేహ, సిద్ధివినాయక, రాగా, కోమలి, మేజిక్, తిరుగుణ, కనకగ్రూప్ తదితర ఫైనాన్స్ కంపెనీలు రాత్రికిరాత్రే బిచాణా ఎత్తేయడంతో జిల్లాలో రూ.925 కోట్లకుపైగా ఆర్థికమోసం జరిగింది. వీటిలో ఒక్క సిమ్స్ సంస్థే రూ.321 కోట్లకుపైగా డిపాజిట్‌దారులను మోసం చేయడం అత్యంత సంచలనాత్మకంగా మారింది. ఇదికాక అసలైన డిపాజిట్‌దారులకే రూ.100కోట్లకుపైగా చెల్లించకుండా ఫైనాన్స్ శుభకార్యాలు,పైచదువుల కోసం డబ్బుదాచుకున్న వేలాదిమంది ఆశలను అడియాసలు చేసి రోడ్డునపడేశాయి. అదేవిధంగా గుడ్‌లక్ ఎంటర్‌ప్రైజెస్ ఆన్‌లైన్‌ట్రేడింగ్ పేరుతో రూ.6 కోట్లు, కనకగ్రూప్ రూ.5కోట్లు చొప్పున వసూలు చేసి బిచాణా ఎత్తేశాయి.  మోసం జరిగిన నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బాధితులకు కనీసం న్యాయం జరగలేదు.
 
గుప్పుమన్న గంజాయి రూ.100 కోట్లకుపైనే
 
జిల్లాలో గంజాయి వ్యాపారం గుప్పుమంటోంది. ఈ ఏడాదంతా అక్రమ రవాణాతో జిల్లా పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఒకప్పుడు పాడేరు, అరకు, చింతపల్లి తదిత ర ప్రాంతాల నుంచి అడపాదడపా రవాణా అయ్యే గంజాయి ఇప్పుడు కొత్తపద్ధతిలో దారి మళ్లుతోంది. అధికంగా రోలుగుంట మీదుగా కార్లలోను, పార్సిల్ వ్యాన్లలోను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఈవిధంగా జిల్లాలో ఈ ఏడాదిలో రూ.100 కోట్లకుపైగా రవాణాతోపాటు వ్యాపారం సాగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసుల విషయానికివస్తే గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని 2013లో మొత్తం 124 కేసులు నమోదు చేస్తే... ఇవి  2012లో 116 కేసులుగా ఉన్నాయి. పట్టుబడ్డ సరకు మొత్తం 11,051 కిలోలు మాత్రమే. వాస్తవానికి అక్రమంగా రవాణా అవుతున్న సరకులో పట్టుబడేది కేవలం పది శాతమేకాగా, మిగిలింది చడీచప్పుడు కాకుండా పోలీసుల కన్నుపడకుండా తరలిపోతున్నదే ఎక్కువ.
 
బెంబేలెత్తించిన ఇసుక మాఫియా
 
గ్రామీణ విశాఖలో ఈ ఏడాది ఇసుక మాఫియా మరింత విజృంభించింది. ఇది నదులు, చెరువులు, వంతెనలతోపాటు సముద్రాన్ని కూడా కబళిస్తూ బరితెగిస్తోంది. పెరుగుతున్న పారిశ్రామిక, ఊపుమీదున్న నిర్మాణరంగ అవసరాలను సొమ్ము చేసుకుంటూ కనిపించిన చోటల్లా ఇసుకను రాత్రికిరాత్రే ఊడ్చిపారేసింది. దీనికి రాజకీయ అండదండలు కూడా తోడవడంతో ఇసుక మాఫియా విర్రవీగుతోంది. జిల్లాల్లో రియల్‌ఎస్టేట్ రంగం ఊపుమీదుండడంతో ఇసుకకు ఊహించని డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అధికారికంగా ప్రభుత్వం నుంచి తవ్వకాలకు అనుమతి లేకపోవడంతో జిల్లాలో శారద, తాండవ నదులతోపాటు రైవాడ, కోనాం, కల్యాణపులోవ  , మేఘాద్రిగెడ్డ, గంభీరం ,బొడ్డేరు, తాచేరు, తాటిపూడి, ఆండ్ర రిజర్వాయర్లలో ఈ ఏడాదంతా భారీ ఎత్తున ఇసుక తన్నుకుపోయారు. ప్రస్తుతం జిల్లాలో 30కిపైగా మండలాల్లో ఇసుక మాఫియా విస్తరించింది. ఈఏడాది ఇసుక అక్రమ వ్యాపారం రూ.80 కోట్లకుపైగానే  జరగడం గమనార్హం.
 
హత్యలు... రోడ్డు ప్రమాదాలు
 
గ్రామీణజిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు కలవరపరిచే స్థాయికి వెళ్లాయి. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా దీనిప్రభావం అనేక కుటుంబాలపై పడింది. ఈ ఏడాది మొత్తం 797 రోడు ్డప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా అనకాపల్లి, యలమంచిలి, చోడవరం తదితర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. హత్యల విషయానికివస్తే  2013లో వీటి సంఖ్య 42గా నమోదయినట్లు పోలీసు శాఖ లెక్కలు చెబుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య తక్కువే అని చెబుతున్నా హత్యలు జరిగిన తీరు మాత్రం జిల్లాలో శాంతిభద్రతల దిగజారుడును కళ్లకు కడుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక హత్యలు ఈఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. దొంగలు పలుచోట్ల దొంగతనాలకు తెగబడి హత్యలుసైతం చేస్తుండడం జిల్లా ప్రజలకు వణుకు పుట్టించింది. గత ఆగస్టు 19న అనకాపల్లిలో కొందరు దుండగులు ఓ బంగారం వ్యాపారి నుంచి రూ.కోటికిపైగా ఆభరణాలు దొంగించారు. అయితే సదరు వ్యాపారి త్రుటిలో వారి నుంచి ప్రాణాలను కాపాడుకున్నారు.
 
నకిలీ నోట్ల హవా
 
గ్రామీణ జిల్లాకు ఇప్పుడు కొత్తరకం సవాల్ ఎదురవుతోంది. నకిలీ కరెన్సీ పెద్ద సమస్యగా తయారైంది. నిన్న మొన్నటివరకు కేవలం ఏజెన్సీకే పరిమితమైన నకిలీ కరెన్సీ ముఠాలు ఇప్పుడు జిల్లా అంతటా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మైదాన ప్రాంతాలైన నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి తదితర ప్రాంతాల్లో  ముఠాలు బరితెగిస్తున్నాయి. అద్దెకు ఇళ్లు తీసుకుని అక్కడే వాటిని ముద్రించడం, అక్కడి నుంచే చలామణీ చేయడం జరుగుతోంది. ప్రధానంగా వారాంతపు సంతలు, చిన్నచిన్న దుకాణాల్లో వీటిని చలామణీ చేసే స్థాయి నుంచి ఏజెంట్లను నియమించుకుని అక్కడి నుంచి దొంగనోట్ల రవాణాతోపాటు చలామణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా చలామణీలో ఉన్న నకిలీ కరెన్సీ సుమారు 80 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 
జిల్లాలో నేరాల సంఖ్య తగ్గింది..
 
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గినట్లు జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. విశాలాక్షినగర్ ఏఆర్ పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గడిచిన ఏడాదిలో నేరాలను అదుపు చేయడానికి పోలీసులు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా వివరించారు. మహిళా భద్రత, ఈవ్ టీజింగ్ నిరోధం, ఇసుక మాఫియా, గంజాయి దొంగ రవాణా, హత్యలు, హత్యాయత్నాలు, రోడ్డు ప్రమాదాలు, నక్సలిజం, అక్రమ మద్యం అమ్మకాల అదుపు తదితర విషయాల్లో తీసుకున్న చర్యలను వివరించారు. చిన్న నేరం చేసినవారిని సైతం అదుపులోకి తీసుకొన్నామని, దీంతో కేసుల సంఖ్య పెరిగినా, నేరాల సంఖ్య తగ్గిందని విశ్లేషించారు. ఎస్పీ అందించిన గణాంకాలు ఇవీ.
 
2014లో తీసుకోదలచిన చర్యలు..
 
ఈ ఏడాది చేపట్టిన చర్యలను కొనసాగించి రాబోవు సంవత్సరంలో మరిన్ని చర్యలు చేపడతామని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. కొన్ని పోలీస్ స్టేషన్లు పరిధిలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని వాటిని ఒక్కో సీఐకి అప్పగిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, వైద్యం, విద్య, విద్యుత్ సౌకర్యాలు కల్పించడానికి చర్యలు చేపడతామన్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లను మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 2014 ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి  ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. పోలీసులకు వ్యక్తిగత రుణాలు ఇంత వరకు ఉన్న రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు పెంచినట్లు తెలిపారు. డెత్ రిలీఫ్ ఫండ్ రూ10,000 నుంచి 15,000 వరకు పెంచామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement