- రాజకీయ నేతల అండతో హత్యలు
- భూదందాలు, సెటిల్‌మెంట్‌లలో జోక్యం
- పోలీసుల కౌన్సెలింగ్ లేకనే పేట్రేగుతున్నారనే ఆరోపణలు
సాక్షి, గుంటూరు : ప్రశాంతంగా ఉంటున్న జిల్లాలో రౌడీషీటర్లు మళ్లీ పేట్రేగిపోతున్నారు. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రౌడీమూకలు.. రాజకీయ నేతల అండతో తిరిగి ప్రతీకార హత్యలు, కిరాయి హత్యలకు తెగబడుతున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య కొత్త రాజధాని ఏర్పడుతుందనే ఊహాగానాలు ఊపందుకోవడంతో భూదందాలు, రియల్ సెటిల్‌మెంట్‌లలో జోక్యం చేసుకుంటున్నారు. భూ ఆక్రమణల్లో బడాబాబుల కొమ్ముకాస్తున్నారు. రౌడీషీటర్ల ఆగడాలు తెలిసినా రాజకీయ నేతల ఒత్తిడి కారణంగా పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారు. భూవివాదాల్లో చిక్కుకుంటున్న బడాబాబులు ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు రౌడీషీటర్లను ఉసిగొల్పుతున్నారు. భారీ మొత్తంలో నగదు ఆఫర్ చేస్తూ కిరాయి హత్యలను ప్రోత్సహిస్తున్నారు.
వరస హత్యలతో హడలిపోతున్న ప్రజలు
జిల్లాలో జరుగుతున్న వరస హత్యలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
నరసరావుపేట మండలం కాకాని గ్రామం వద్ద రౌడీషీటర్ నల్లపాటి శివయ్య వర్గీయులు ఈ ఏడాది మార్చి 16న ద్విచక్రవాహనంపై వెళుతున్న రౌడీషీటర్లు పాదర్తి మధు, జోసఫ్‌కుమార్‌లను వేటకొడవళ్లతో కిరాతకంగా నరికి చంపారు.
గుంటూరులో పది రోజుల వ్యవధిలో నాలుగు హత్యలు జరగడం తీవ్ర కలకలాన్ని రేపింది. చుట్టుగుంట సెంటర్‌లో మాజీ రౌడీషీటర్ బచన్ శివను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చం పారు. ఈ దాడిలో అనేక మంది రౌడీషీటర్లు ఉండటం గమనార్హం. శ్రీనివాసరావుతోటలో రౌడీషీటర్ కుంచాల దుర్గాచంద్రరావు (32)ను పక్కా పథకం ప్రకారం వేటకొడవళ్లతో హతమార్చారు.
గుంటూరు రూరల్ మండలం పొత్తూరు గ్రామానికి చెందిన పెనుమచ్చ నాగేశ్వరరావును గ్రామస్తులు కొందరు కిరాయి హత్య చేయించారు. భూ వివాదం వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఏదీ ?
►కొన్నేళ్ల కిందట రౌడీషీటర్లను ప్రతి ఆదివారం ఆయా పోలీస్ స్టేషన్లకు పిలిపించి సీఐ స్థాయి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించేవారు. చివరలో వారి సంతకాలు తీసుకుని పంపేవారు.
►ఈ ప్రక్రియలో ఆ వారంలో రౌడీషీటర్లు ఏవైనా దౌర్జన్యాలకు పాల్పడివుంటే పోలీసులు వాటిని గుర్తించి తమదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించేవారు.
► ఈ తరహా కౌన్సెలింగ్ వల్ల పోలీసులు అం టే నే రౌడీషీటర్లలో ఓ విధమైన భయం ఏర్పడి గొడవలకు దూరంగా వుంటూ వుండేవారు.
పోలీసులు నాలుగేళ్లుగా కౌన్సెలింగ్ విషయాన్ని మరవడంతో అనేక మంది రౌడీషీటర్లు తిరిగి తమ నేరమయ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు.
►రాజకీయ నేతల ఒత్తిడి, భారీ మొత్తంలో డబ్బు ముట్టడం వల్ల రౌడీషీటర్లను పోలీసులు స్వేచ్ఛగా వదిలి వేశారనే ఆరోపణలు లేకపోలేదు. అందువల్లే రౌడీషీటర్లు తిరిగి హత్యలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
►ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు రౌడీషీటర్లపై దృష్టి సారించి వీరి వల్ల ఇబ్బందులు పడుతున్న అమాయక ప్రజల ధన, ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
రౌడీషీటర్ల బరితెగింపు
Published Sun, Aug 17 2014 1:22 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement