సాక్షి, మంగళగిరి: కత్తి పట్టిన వాడు కత్తికే బలి అవుతాడని మంగళగిరి పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటన మరోసారి రుజువు చేసింది. వివరాలలోకి వెళితే.. పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన తాడిబోయిన ఉమాయాదవ్ రాత్రి ద్విచక్రవాహనంపై వెనుక కూర్చుని ఇంటికి వెళ్తుండగా నలుగురు దుండగులు అటకాయించి కత్తులతో మెడపై ముఖంపై నరికి దారుణంగా హత్య చేశారు.
రోజులాగే పట్టణంలోని కార్యాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి ఇస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని బేతపూడి సర్పంచ్ సాయిప్రసాద్‌ను కురగల్లు గ్రామం వద్ద కారులో వస్తుండగా కత్తులతో దాడి చేసిన ఘటనలో ప్రథమ మద్దాయి ఉమా యాదవ్. అప్పట్లో పోలీసులు ఈయనపై రౌడీ షీట్ తెరిచారు.
బెయిల్‌పై బయటకు వచ్చిన ఉమాయాదవ్ టీడీపీ హయాంలో ఓ పోలీస్ అధికారి సాయంతో అనేక భూవివాదాల్లో తలదూర్చేవారు. ప్రస్తుతం ద్వారకానగర్‌లో ఇరువర్గాలుగా ఉన్న నాయకులు తమ ఆధిపత్యం కోసం ఉమాయాదవ్‌ను హత మార్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నుంచి బదిలీ అయిన పోలీస్ అధికారితోనూ కొంత కాలంగా సెటిల్‌మెంట్లతోపాటు డబ్బులు విషయంలో తేడాలు వచ్చిన కారణంగానే ఉమాయాదవ్‌ను హత్యకు గురైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు తమకు అనుమానం ఉన్న స్థానిక నాయకుడి ఇంటిపై దాడి చేయబోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment