డిఎన్ రావు
హైదరాబాద్: గల్లంతైన విద్యార్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల బీమా పరిహారం మూడు నెలల్లో తల్లిదండ్రులకు అందిస్తామని విఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ సెక్రటరి డిఎన్ రావు చెప్పారు. విద్యార్ధులు చెల్లించిన ఫీజును తిరిగి ఇస్తామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి తాము గుణపాఠం నేర్చుకున్నట్లు తెలిపారు. టూర్‌లో ఉన్న మరో 600 మంది విద్యార్థులను వెనక్కి రప్పించినట్లు రావు చెప్పారు.
ఇదిలా ఉండగా, బియాస్ నదిలో అత్యాధునిక పరికరాలతో వెతికినా మృతదేహాలు ఇంకా దొరకలేదు. మొత్తం 24మంది గల్లంతు కాగా, కేవలం ఎనిమిది మృతదేహాలు మాత్రమే దొరికాయి. మిగతావారి జాడ తెలియలేదు. గల్లంతైన వారిలో 16 మంది విద్యార్థుల జాడ తెలియక పోవడంతో చివరి చూపుకూడా దక్కలేదని వారి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లార్జీ డ్యాంకు దిగున 7 కిలోమీటర్ల వరకూ గాలింపు పూర్తయింది. మరో 9 కిలోమీటర్లమేర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్న బిడ్డల కడచూపు కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.