సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనికిరాని వైద్య పరికరాలను బాగు చేయించే పేరుతో కొందరు అధికారులు, రాజకీయనేతలు రూ.కోట్లు కొల్లగొట్టినట్టు వివిధ ఆస్పత్రుల నుంచి వస్తున్న ఫిర్యాదులను బట్టి వెల్లడైంది. వైద్య పరికరాల నిర్వహణకు ఏటా రూ.40 కోట్ల చొప్పున ఐదేళ్ల వ్యవధికి టెలీ బయోమెడికల్ సర్వీసెస్ (టీబీఎస్) అనే సంస్థకు 2015 నవంబర్‌లో కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ పనికి టీబీఎస్ రెండేళ్ల కాలంలో ఇప్పటివరకు రూ.20 కోట్లు కూడా ఖర్చు చేయలేదని, దీనికి మాత్రం నిధులు చెల్లించినట్టు తెలిసింది. వైద్య పరికరాలు ఏ ఒక్క ఆస్పత్రిలోనూ పనిచేయడం లేదని, టీబీఎస్‌పై చర్యలు తీసుకోవాలని బోధనాస్పత్రుల నుంచి వందల కొద్దీ ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకుండా ఆ సంస్థకు రూ.కోట్లు చెల్లిస్తున్న తీరు వైద్య ఆరోగ్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బోధనాస్పత్రుల నుంచి ఫిర్యాదుల పరంపర
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆస్పత్రుల నుంచి బోధనాస్పత్రుల వరకూ 51 వేల వైద్య పరికరాలు ఉన్నట్టు తేలింది. వెంటిలేటర్ల నుంచి రేడియంట్ వార్మర్లు ఇలా వేలాది పరికరాలు మరమ్మతుకు వచ్చాయి. వాటిని బాగు చేయాలని సమాచారమిచ్చినా టీబీఎస్ స్పందించలేదు. దీంతో బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు వైద్య విద్యా సంచాలకులకు, వైద్య విధానపరిషత్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేశారు. కానీ వాళ్లూ స్పందించలేదు. ఉన్నతాధికారులకు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదులు చేసినా స్పందించలేదంటే ఏ స్థాయిలో అవినీతి ఉందో ఊహించొచ్చు. దీనివెనుక ఆ శాఖ ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)లో ఇంజనీర్, మరికొంతమంది రాజకీయ నేతలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే టీబీఎస్‌కు రూ.50 కోట్ల బిల్లులు చెల్లించారు. కానీ రూ.5 కోట్ల పనులు కూడా చేయనట్టు అధికారులు చెబుతున్నారు. వారెంటీ ఉన్న పరికరాలను కూడా నిర్వహణ పరిధిలోకి తీసుకొచ్చి సంస్థకు నగదు చెల్లించడం గమనార్హం.
వారం రోజుల్లోనే మరమ్మతు చేయాలి
టీబీఎస్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చిన్న పరికరం మరమ్మతుకు వస్తే 24 గంటల్లో, పెద్ద పరికరాన్ని 7 రోజుల్లో రిపేరు చేయాలి. కానీ విశాఖపట్నం ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఈ ఏడాది మార్చి 13న ఒక పరికరం మరమ్మతుకు వస్తే ఇప్పటివరకూ చేయలేదు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ జూన్‌లో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈకి) లేఖ రాశారు. కానీ ఇప్పటికీ ఆ పరికరాలు మూలనే పడి ఉన్నాయి. టీబీఎస్.. నిపుణులైన ఇంజనీర్లను నియమించలేదు. కొన్ని పరికరాలను మరమ్మతు పేరుతో విడదీసినా బిగించడం చేతకాక అక్కడే పడేసినట్టు విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
వివిధ ఆస్పత్రుల నుంచి వచ్చిన ఫిర్యాదులు
వివిధ బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌ల నుంచి సేకరించిన సమాచారం మేరకు పలు ఫిర్యాదులు డీఎంఈకి వచ్చాయి. ఆయా ఆస్పత్రులకు ‘సాక్షి’ వెళ్లి వివరాలు తెలుసుకోగా కీలక విషయాలు బయటపడ్డాయి.
2017 ఆగస్టులో ఒంగోలు రిమ్స్ డైరెక్టర్ ఆస్పత్రిలో రెండు వెంటిలేటర్లు, ఎక్స్‌రే మెషీన్లు పనిచేయడం లేదని టీబీఎస్‌కు సమాచారం ఇవ్వగా ఇప్పటికీ వాటిని రిపేరు చేయలేదు.
2017 సెప్టెంబర్‌లో అనంతపురం బోధనాస్పత్రికి చెందిన ఆఫ్తాల్మాలజీ విభాగాధికారి బయోమెడిక్ స్కాన్ మెషీన్ పనిచేయడంలేదని చెప్పినా సరిచేయలేదని లేఖ పంపారు.
2017 జూలైలో కాకినాడ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆస్పత్రిలో పలు వైద్య పరికరాలు మరమ్మతులకు వచ్చినా సంస్థ స్పందించడం లేదని దానిపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఫిర్యాదు చేశారు.
2017 జూన్‌లో విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి గుండెజబ్బుల విభాగంలో ఏసీ పనిచేయడం లేదని పలుసార్లు ఫిర్యాదు చేసినా టీబీఎస్ స్పందించలేదని, ఏసీ లేకుండా క్యాథ్ ల్యాబ్ పనిచేయడం సాధ్యం కాదని దీనిపై చర్యలు తీసుకోండంటూ లేఖ రాశారు.
ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో నాకే తెలియదు
సంస్థ పనితీరును ఆయా ఆస్పత్రుల్లో నియమించిన నోడల్ అధికారులే పర్యవేక్షించాలి. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో నాకే తెలియదు. పరికరాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు రావడం పెద్ద వింతేమీ కాదే. అయినా ఫిర్యాదులు వస్తే డీఎంఈ చర్యలు తీసుకోవాలి. నాకేం సంబంధం లేదు. నేను రాష్ట్రస్థాయి నోడల్ అధికారిణినైనా వాళ్లదే బాధ్యత. – రోహిణి, నోడల్ అధికారి, రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment