మందు నోట్లు! | Rs. 5 retailers shortage of capital, the market with the name of the new plan | Sakshi
Sakshi News home page

మందు నోట్లు!

Published Sat, Jul 12 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

మందు నోట్లు!

మందు నోట్లు!

రూ. 5 చిల్లర కొరత పేరుతో రాజధానిలో మద్యం వ్యాపారుల సరికొత్త దందా
ప్లాస్టిక్ కార్డుపై ‘* 5’ అని ముద్రించి ఇస్తున్న నిర్వాహకులు
అన్ని మద్యం షాపుల్లో  చెల్లుబాటయ్యేలా ఒప్పందాలు


హైదరాబాద్: చిల్లర మోత ఎందుకనో..! మరేమోగానీ..!? కిరాణా దుకాణం నుంచి బేకరీల దాకా ఎక్కడ చూసినా ‘చిల్లర’కు కొరతే. రూపాయో రెండు రూపాయలో ఇవ్వాలంటే ఏ చాక్లెట్లో చేతిలో పెడుతున్నారు. ఇంకా ఎక్కువైతే బిస్కట్ ప్యాకెట్లో.. మరో వస్తువో ఇస్తున్నారు. వీళ్లంతా ఒక ఎత్తయితే.. హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలవారు మరో ఎత్తు. వీళ్లయితే చిల్లర సమస్యను తీర్చుకోవడంతో పాటు మందుబాబులను మళ్లీ రప్పించేలా ఏకంగా ‘* 5’ ప్రైవేటు నోట్లనే తయారు చేసుకున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నరే ఆశ్చర్యపోయేలా బార్ కోడ్‌లు,‘ఐ ప్రామిస్ టు పే’ హామీతో ‘ప్లాస్టిక్ కరెన్సీ’ని ము ద్రించి, వినియోగిస్తున్నారు. మద్యం దుకాణం పేరుతోపాటు నిర్వాహకుల సంతకాన్నీ వాటిపై ముద్రించి... అక్కడ కాకపోతే మరో మద్యం దుకాణంలోనైనా చెల్లుబాటయ్యేలా ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని మద్యం దుకాణాల్లో చలామణి అవుతున్న ఈ ఐదు రూపాయల సొంత కరెన్సీ క థా కమామీషు..!

విజిటింగ్ కార్డు సైజులో...

ఒక వినియోగదారుడు సికింద్రాబాద్‌లోని ఓ పేరుమోసిన మద్యం దుకాణానికి వెళ్లి రూ. 100 నోటు ఇచ్చి రూ. 95 విలువైన మద్యం కొనుగోలు చేశాడనుకోండి. గతంలో అయితే ఏ పల్లీల ప్యాకెట్టో, మరేదైనా తినుబండారమో ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం విజిటింగ్ కార్డు పరిమాణంలో ఉన్న ఒక ‘ప్లాస్టిక్ నోటు’ను చేతిలో పెడుతున్నారు. ఇదేమిటంటే... ‘‘ఐదు రూపాయల చిల్లర లేదు! ఈ సారి వచ్చేటప్పుడు దీన్ని తీసుకొస్తే.. మీ డబ్బు సర్దుబాటు చేస్తాం..’’ అని చెబుతున్నారు. ‘నేను ఉండేది హిమాయత్‌నగర్‌లో మళ్లీ ఇక్కడికెందుకు వస్తాను..?’ అని కొనుగోలుదారుడు ప్రశ్నిస్తే... హైద ర్‌గూడలో మాకు షాపుంది. అక్కడైనా చెల్లుతుంది. సిటీలోని మా ఐదు బ్రాంచిల్లో ఎక్కడైనా ఇస్తారు..’ అని బదులిస్తున్నారు. ఇలా ఐదు రూపాయల చిల్లర కొరత తీర్చుకునే సాకుతో ఆయా బ్రాంచిలకు ఒక రెగ్యులర్ వినియోగదారుడిని తయారు చేసుకుంటున్నారు.

‘మందు’ నోట్లకు ఒప్పందాలు..

ఎక్కువ దుకాణాలున్న వారే కాదు.. ఆయా ప్రాంతాల్లో విడివిడిగా మద్యం దుకాణాలున్నవారు కూడా ఇదే తరహా ‘*5 ప్లాస్టిక్ కరెన్సీ’ని వినియోగిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలోని మరే మద్యం షాపులో దాన్ని ఇచ్చినా.. చెల్లుబాటయ్యేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఉదాహరణకు అంబర్‌పేట ప్రాంతంలో ఉన్న ఒక మద్యం షాపులో సరుకు కొనుగోలు చేసినప్పుడు నిర్వాహకులు ఇచ్చే ఈ నోట్ అంబర్‌పేట, నల్లకుంట, బర్కత్‌పురా మొదలైన ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ఇచ్చి మద్యం కొనుగోలు చేసుకోవచ్చు. తర్వాత ఆయా షాపుల వాళ్లు ఈ నోట్లను ‘మార్పిడి’ చేసుకుంటారన్నమాట.

భద్రత, హామీ కూడా..!

విజిటింగ్ కార్డు పరిమాణంలో ఉండే ఈ ‘మందు’ నోట్ల మీద ఎడమవైపు ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రూపాయి చిహ్నంతో ‘*5’ను, పైభాగంలో అసలైన కరెన్సీ నోట్లపై ఉన్నట్టుగా.. ‘ఐ ప్రామిస్ టు పే’ అనే ఆంగ్ల అక్షరాలను ముద్రించారు. వీటిని నకిలీవి ముద్రించకుండా బార్‌కోడ్‌లు ఉండడం విశేషం. ఈ బార్‌కోడ్ పక్క ముద్రించిన నెల, సంవత్సరం ఉంటాయి. అయితే ఇలాంటి నోట్లను తొలుత కాగితంపై ముద్రించినా.. అవి తొందరగా చిరిగిపోతుండడంతో విజిటింగ్ కార్డుకు ఉపయోగించే ‘ప్లాస్టిక్ పేపర్’ను వాడుతున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement