రూ. 124 కోట్ల పనులపైదేశం నేతల కన్ను
- అధికార నేతల ఒత్తిడితో ఏసీడీపీ, ఎంపీ ల్యాడ్స్ పనులకు బ్రేక్
- ప్రభుత్వ ఆదేశాలతో ‘ప్రత్యేక అభివృద్ధి నిధి’ పథకం పనుల రద్దు
- ఆ పనులను టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేయత్నం
నామినేషన్ పనులపై డామినేషన్ చూపి.. అధికారపార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడానికి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఏసీడీపీ(అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి పథకం), ఎంపీ ల్యాడ్స్(లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధి పథకం) కింద చేపట్టిన పనులకు టీడీపీ నేతల ఒత్తిడితో అధికారులు బ్రేక్ వేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్) కింద చేపట్టిన పనులను రద్దు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టి పక్షం రోజులు కూడా గడవక ముందే ఏసీడీపీ, ఎంపీ ల్యాడ్స్, ఎస్‌డీఎఫ్ పథకాల కింద ప్రస్తుతం రద్దు చేసిన రూ.124 కోట్ల పనులను తమ కార్యకర్తలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. వివరాల్లోకి వెళితే..
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రతి శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి ఏసీడీపీ పథకం కింద ఏడాదికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తుంది. ఇందులో రూ.50 లక్షల విలువైన పనులను ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే.. తక్కిన 50 లక్షల విలువైన పనులను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ప్రతిపాదించవచ్చు. లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ పథకం కింద ఏటా రూ.5 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ నిధులతో చేపట్టే పనులను ఆ లోక్‌సభ స్థానం ఎంపీ ప్రతిపాదించవచ్చు.
ఇక ప్రత్యేక అభివృద్ధి నిధి పథకం కింద పనుల మంజూరు పూర్తిగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉండేది. ఈ పథకం కింద తన నియోజకవర్గం, అస్మదీయ ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి అప్పటి సీఎం కిరణ్ విచ్చలవిడిగా నిధులు మంజూరు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తన హయాంలో చివరి రోజుల్లో పీలేరు, గంగాధరనెల్లూరు, చిత్తూ రు తదితర నియోజకవర్గాల అభివృద్ధికి రూ.110 కోట్లను మంజూరు చేశారు. ఇందులో ఒక్క పీలేరు నియోజకవర్గానికే రూ.80 కోట్లను మంజూరు చేయడం గమనార్హం.
జిల్లాలో 14 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో ఏసీడీపీ, ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరై, పూర్తికాని పనుల విలువ రూ.25 కోట్లకుపైనే ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్‌డీఎఫ్ కింద మంజూరైన పనుల్లో ఇప్పటికే రూ.11 కోట్ల విలువైన పనులను పూర్తిచేశారు. మరో రూ.109 కోట్ల విలువైన పనులను చేపట్టాల్సి ఉంది.
ఇది గుర్తించిన ప్రభుత్వం ఆ పనులను రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వాటితోపాటూ ఏసీడీపీ, ఎస్‌డీఎఫ్ కింద మంజూరు చేసిన పనుల్లో చేపట్టని, పూర్తికాని పనులను తక్షణమే రద్దు చేయాలని అధికారపార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు వాటిని రద్దు చేశారు. మొత్తమ్మీద ఏసీడీపీ, ఎస్‌డీఎఫ్, ఎంపీ ల్యాడ్స్ కింద రూ.124 కోట్ల విలువైన పనులను రద్దు చేశారు.
ఇప్పుడు ఆ నిధులతో చేపట్టే పనులను టీడీపీ కార్యకర్తలకే కట్టబెట్టేందుకు ఆపార్టీ నేతలు వ్యూహం రచిస్తున్నారు. ఆ మేరకు అధికార యంత్రాంగానికి టీడీపీ ప్రజాప్రతినిధులు సంకేతాలు పంపారు. రూ.124 కోట్లతో 14 నియోజకవర్గాల్లో చేపట్టే పనుల అంచనాలను తక్షణమే సిద్ధం చేయాలని గురువారం అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కలెక్టర్ కె.రాంగోపాల్‌ను ఆదేశించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అంచనాలు సిద్ధమవగానే.. ఆ పనులను టీడీపీ కార్యకర్తలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి, లబ్ధి చేకూర్చాలన్నది ఆపార్టీ నేతల ఎత్తుగడ..!