ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఒకరి మృతి | RTC bus, bike, colliding one killed | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఒకరి మృతి

Published Thu, Sep 19 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

RTC bus, bike, colliding one killed

జక్రాన్‌పల్లి,న్యూస్‌లైన్: జక్రాన్‌పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామ శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో అజ్మీర ధారాసింగ్(35) మృతిచెందాడు. స్థానికులు,పోలీసుల వివరాల ప్రకారం... జిల్లాకేంద్రం నుంచి చింతలూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జక్రాన్‌పల్లి నుంచి పుప్పాలపల్లి గ్రామ పరిధిలోని గన్యతండాకు వెళ్తున్న బైక్ సికింద్రాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ధారాసింగ్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడే మరణించాడు.
 
 బైక్‌పై ధారాసింగ్ రాంగ్‌రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే తండావాసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలివచ్చారు. దీంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామైంది.అనంతరం సంఘటనా స్థలానికి ధర్పల్లి ఎస్సై దామోదర్, జక్రాన్‌పల్లి ఏఎస్సై నర్సింహులు తమ సిబ్బందితో వచ్చి తండావాసులకు జాతీయ రహదారిపై నుంచి పక్కకు నెట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్సై నర్సింహులు తెలిపారు. మృతుడికి భార్య లలిత, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
 గన్యతండాలో విషాదం...
 గణేశ్ నిమజ్జనం రోజునే ప్రమాదంలో ధారాసింగ్ మృతిచెందడంతో గన్యతండాలో విషాదం నెలకొంది.తండాలో గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి యువజన సంఘాల సభ్యులు,తండావాసులు సిద్ధమవుతున్నారు.ఈ తరుణంలో రోడ్డు ప్రమాదంలో దారాసింగ్ చనిపోయాడనే వార్తా తండావాసులను తీవ్రంగా కలచివేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement