చెన్నై వైద్యాధికారులతో సావిత్రి, లావణ్య
జక్రాన్‌పల్లి: మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన ఓ వివాహిత 12 ఏళ్లకు సొంతింటికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన సావిత్రి, లింగన్న దంపతులు. వీరికి ఏడాది పాప ఉంది. సావిత్రి మతిస్థిమితం కోల్పోవడంతో 2007లో పాపను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. 2008లో చెన్నై రైల్వే స్టేషన్‌లో పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశం మేరకు సావిత్రిని చెన్నై మానసిక వైద్యశాలలో చేర్పించగా.. పాపను బాలిక సం రక్షణ కేంద్రానికి తరలించారు.
12 ఏళ్లపాటు చికిత్స పొందిన సావిత్రి.. మామూలు స్థితిలోకి వచ్చింది. దీంతో ఐఎంహెచ్ డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే ఊరు పడకల్, మండలం జక్రాన్‌పల్లి, జిల్లా నిజామాబాద్ అని తెలిపింది. అక్కడి అధికార యంత్రాంగం నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు 4 రోజుల క్రితం సమాచారం అందించారు. సోమవారం చెన్నైలో సావిత్రిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సావిత్రి కూతురు లావణ్య ఎనిమిదో తరగతి ఇంగ్లిష్ మీడియం చదువుతోంది. లావణ్య పూర్తిగా ఇంగ్లిష్ లేదా తమిళం మాట్లాడుతుండటంతో ఆమెను పడకల్‌కు పంపించడంలేదని తెలిపారు. 12 ఏళ్ల తరువాత తన బిడ్డ ఇంటికి చేరుకుంటుండటంతో కుటుంబీకులు, బంధువుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment