Jakranpalli
-
పన్నెండేళ్లకు ఇంటికి చేరిన సావిత్రి
సాక్షి, నిజామాబాద్(జక్రాన్‌పల్లి): పన్నెండేళ్ల తర్వాత తల్లీబిడ్డలు కలుసుకున్న ఉద్విగ్న క్షణాలవి.. ఒకరినొకరు తనివితీరా చూసుకున్నారు..ఆలింగనం చేసుకున్నారు.. కన్నీరుమున్నీరయ్యారు.. జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామంలో బుధవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన సావిత్రి రైలులో చెన్నై చేరగా అక్కడి రైల్వే పోలీసులు కోర్టుకు సరెండర్ చేశారు. కోర్డు ఆదేశాల మేరకు అధికారులు సావిత్రిని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హాస్పిటల్లో చేర్పించారు. ఆమె కూతురును బాలిక సంరక్షణ కేంద్రంలో చేర్పించి చదువు చెప్పించారు. సుదీర్ఘ చికిత్స అనంతరం సావిత్రి మామూలు స్థితికి రాగా అక్కడి వైద్యులకు తన వివరాలు తెలియ జేసింది. అక్కడి వైద్యులు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అం దించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జక్రాన్‌పల్లి తహసీల్దార్ కిషన్ సావిత్రి రాక కోసం కృషి చేశారు. కుటుంబీకులు చెన్నై వెళ్లి సావిత్రిని తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను సావిత్రి గుర్తు పట్టింది. గతం గుర్తుందో లేదోనన్న వారు అనుమానాలను నివృత్తి చేసింది. గ్రామ సర్పంచ్ పుప్పాల శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు ఎస్ గంగారెడ్డి, వార్డు సభ్యులు అప్క సత్యం, సాయిలు ఇంటికి వెళ్లి సావిత్రి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ శ్రీనివాస్ సావిత్రికి ఆర్థిక సహా యాన్ని అందజేశారు. సావిత్రి భర్త లింగన్న గతంలో చనిపోయాడని కుటుంబీకులు తెలిపారు. సావిత్రికి ఇంటి నిర్మాణంతో పాటు పింఛను, రేషన్ సదుపాయం కల్పించాలని కుటుంబీకులు కోరుతున్నారు. -
పన్నెండేళ్లకు కుటుంబం చెంతకు..
జక్రాన్‌పల్లి: మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన ఓ వివాహిత 12 ఏళ్లకు సొంతింటికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన సావిత్రి, లింగన్న దంపతులు. వీరికి ఏడాది పాప ఉంది. సావిత్రి మతిస్థిమితం కోల్పోవడంతో 2007లో పాపను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. 2008లో చెన్నై రైల్వే స్టేషన్లో పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశం మేరకు సావిత్రిని చెన్నై మానసిక వైద్యశాలలో చేర్పించగా.. పాపను బాలిక సం రక్షణ కేంద్రానికి తరలించారు. 12 ఏళ్లపాటు చికిత్స పొందిన సావిత్రి.. మామూలు స్థితిలోకి వచ్చింది. దీంతో ఐఎంహెచ్ డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే ఊరు పడకల్, మండలం జక్రాన్‌పల్లి, జిల్లా నిజామాబాద్ అని తెలిపింది. అక్కడి అధికార యంత్రాంగం నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు 4 రోజుల క్రితం సమాచారం అందించారు. సోమవారం చెన్నైలో సావిత్రిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సావిత్రి కూతురు లావణ్య ఎనిమిదో తరగతి ఇంగ్లిష్ మీడియం చదువుతోంది. లావణ్య పూర్తిగా ఇంగ్లిష్ లేదా తమిళం మాట్లాడుతుండటంతో ఆమెను పడకల్‌కు పంపించడంలేదని తెలిపారు. 12 ఏళ్ల తరువాత తన బిడ్డ ఇంటికి చేరుకుంటుండటంతో కుటుంబీకులు, బంధువుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
జక్రాన్‌పల్లిలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు
జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జక్రాన్‌పల్లిలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని నిజామాబాద్ జేసీ రవీందర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం శుక్రవారం జక్రాన్‌పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సిద్ధంగా ఉంచామన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘ధరణి’ ద్వారా పాస్బుక్లందించాలి వివిధ కారణాలతో నిలిచిన పట్టాదారు పాస్‌బుక్‌లు ధరణి వెబ్సైట్ ద్వారా తహసీల్దార్ డిజిటల్ సంతకంతో త్వరగా పూర్తి చేసి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని జేసీ సూచించారు. జిల్లాలో ఐదు విడుతలుగా రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందించామన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా పాస్‌బుక్‌లు నిలిచిపోయాయన్నారు. వాటిని వెంటనే పరిశీలించి రైతులకు పాస్‌బుక్‌లు అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు వారం రోజుల్లో జిల్లా కార్యాలయానికి పంపించాలన్నారు. కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. ముఖ్యంగా కల్యాణ లక్ష్మి దరఖాస్తులకు గెజిటెడ్ సంతకం కోసం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పారు. గెజిటెడ్ సంతకం లేకుండానే విచారణ చేసి దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలలో దొర్లిన తప్పొప్పులను సరి చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ సతీష్‌రెడ్డి, ఆర్ఐ అరుణ ఉన్నారు. -
‘సర్పంచ్ గ్రామ బహిష్కరణ’పై విచారణ
జక్రాన్‌పల్లి : చింతలూర్ సర్పంచ్ శోభతోపాటు ఆమె భర్త సంతోష్‌లను గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) సభ్యులు గ్రామ బహిష్కరణ చేశారన్న ఆరోపణలపై మంగళవారం నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ గ్రామంలో విచారణ జరిపారు. సర్పంచ్ శోభ, ఆమె భర్త సంతోష్‌లకు లక్ష రూపాయల జరిమానా విధించారని సాయమ్మ అనే మహిళ తెలిపింది. సర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు మైక్ ద్వారా దండోరా వేయిం చారని పేర్కొంది. సర్పంచ్‌కు దుకాణాల్లో ఎలాంటి వస్తువులు ఇవ్వరాదని, సర్పంచ్‌కు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు తెచ్చుకోరాదని హెచ్చరించారని పోశన్న అనే వ్యక్తి తెలిపారు. వీడీసీ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసి న మినరల్ వాటర్ ప్లాంటునుంచే నీళ్లు తెచ్చుకోవాల ని, కలిగోట్‌లో ఉన్న సర్పంచ్ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకోకూడదని మాత్రమే మైక్‌లో చెప్పించామన్నా రు. ఇసుక విషయంలో సర్పంచ్ భర్త సంతోష్ అధికారులకు ఫిర్యాదు చేశారని పెద్దోళ్ల గంగారాం తెలిపారు. గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాడన్న కారణంతో అతడికి లక్ష రూపాయల జరిమానా విధించామని పేర్కొన్నారు. కానీ సంతోష్ ఆ జరిమానా చెల్లించలేదన్నారు. అదే సమయంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు పెద్దగా నినాదాలు చేశారు. గ్రామ బహిష్కరణ విధిం చిన వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ వారిని సముదాయించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్య ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించరాదని వీడీసీ సభ్యులకు సూచించారు. డీఎస్పీ వెంట డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సాయినాథ్ ఉన్నారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి చింతలూర్ సర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని ఏఐకేఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చింతలూర్‌లో విలేకరులతో మాట్లాడారు. గ్రామ సర్పంచ్‌ను బహిష్కరించడం ఆటవిక చర్యన్నారు. వీడీసీ పేరుతో దళితులపై పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయకపోతే గురువారం ఆర్మూర్‌లో నిర్వహించే సీఎం సభలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాం, దళిత ఐక్య సంఘటన జిల్లా అధ్యక్షుడు సంకెపల్లి బుచ్చన్న, వాడి ఎంపీటీసీ సభ్యుడు ఆనంద్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ తదితరలు పాల్గొన్నారు. -
సర్పంచ్ కుటుంబం గ్రామ బహిష్కరణ
నిజామాబాద్: సర్పంచ్ కుటుంబాన్నే బహిష్కరించిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చోటు చేసుకుంది. సర్పంచ్ శోభ కుటుంబాన్ని గ్రామస్థులు బహిష్కరించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఈ చర్య తీసుకోవడం గమనార్హం. బహిష్కరణతో పాటు సర్పంచ్ కుటుంబానికి లక్ష రూపాయల జరిమానా విధించింది గ్రామాభివృద్ధి కమిటీ. సర్పంచ్ కుటుంబాన్ని బహిష్కరించడంపై దళిత సంఘాలు మండిపడ్డారు. చింతలూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి. -
ఎయిర్‌పోర్టు వస్తోంది
జక్రాన్‌పల్లి:జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ప్రజల కల నెరవేరబోతోంది. దేశంలో 51, రాష్ట్రంలో 8 ప్రాంతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని గత ఏడాది జూన్ 29న ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయించింది. కానీ, ఈ విషయాన్ని బడ్జెట్ లో ప్రస్తావించలేదు. తాజాగా ఎన్డీఏ సర్కారు ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల స్థాపనకు బడ్జెట్లో సుముఖత వ్యక్తం చేయడంతో మళ్లీ జిల్లాలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన తె రపైకి వచ్చింది. జక్రాన్‌పల్లి మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని గ తంలో భావించారు. ఇందుకోసం 795.36 ఎకరాల పట్టా భూములను, 1,208.26 ఎకరాల అసైన్డ్ భూములను అప్పగించడానికి జక్రాన్‌పల్లి మండల రైతులు ముందు కు వచ్చారు. అయితే, ఎయిర్ ట్రాఫిక్ పెరి గి వైమానిక కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని, 2009లో రక్షణ శాఖ అ భ్యంతరం వ్యక్తం చేసింది. కరీంనగర్తోపా టు జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పా టు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల ని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఈ అంశం తాత్కాలికంగా మరుగునపడిం ది. పీఎంఓ నిర్ణయంతో మళ్లీ తెరపైకి వచ్చింది. యూనివర్సిటీ శంకుస్థాపన సమయంలోనే వైఎస్ హామీ డిచ్‌పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ శం కుస్థాపనకు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు విచ్చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జక్రాన్‌పల్లి మండలంలోనే ఎ యిర్పోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఎయిర్‌పోర్టు స్థాపన కోసం ఎనలేని కృషి చేశారు. ఎట్టకేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో జిల్లాకో ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సంకల్పించిన దివంగత ముఖ్యమంత్రి కల నెరవేరబోతోంది. అప్పట్లో వైఎస్ ఆలోచనకు అనుగుణంగా జక్రాన్‌పల్లి జక్రాన్‌పల్లి, కొలిప్యాక్, తొర్లికొం డ, మనోహరాబాద్ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. జిల్లాలో మరెక్కడా లేని విధంగా ఎంతో విశాలమైన స్థలం ఇక్కడే ఉంది. దీంతో నాలుగు గ్రామాల పరిధిలోని 2004.22 ఎకరాల భూమిని సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రామాల రూపురేఖలు మారుతాయి విమానాశ్రయం ఏర్పాటయితే జిల్లాతోపాటు చుట్టూ ఉన్న గ్రామాల రూపు రేఖలు మారిపోయి అభివృద్ధి బాట పడతాయని ఆశించిన రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. నష్ట పరిహారం విషయంలో స్వల్ప వివాదం ఏర్పడినా, రైతులంతా విమానాశ్రయం ఏర్పాటుకే సుముఖత వ్యక్తం చేశారు. విమానాశ్రయం ప్రతి పాదిస్తున్న స్థలం 44వ నంబర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉంది. తెలంగాణ యూనివర్సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోనే జిల్లావాసులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. వీరితోపాటు సీడ్ వ్యాపారం ఇక్కడ అభివృద్ధి చెందింది. వీరందరికీ విమానాశ్రయం ఎంతగానో ఉపయోగపడుతుంది. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఒకరి మృతి
జక్రాన్‌పల్లి,న్యూస్‌లైన్: జక్రాన్‌పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామ శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో అజ్మీర ధారాసింగ్(35) మృతిచెందాడు. స్థానికులు,పోలీసుల వివరాల ప్రకారం... జిల్లాకేంద్రం నుంచి చింతలూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జక్రాన్‌పల్లి నుంచి పుప్పాలపల్లి గ్రామ పరిధిలోని గన్యతండాకు వెళ్తున్న బైక్ సికింద్రాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ధారాసింగ్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడే మరణించాడు. బైక్‌పై ధారాసింగ్ రాంగ్రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే తండావాసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలివచ్చారు. దీంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామైంది.అనంతరం సంఘటనా స్థలానికి ధర్పల్లి ఎస్సై దామోదర్, జక్రాన్‌పల్లి ఏఎస్సై నర్సింహులు తమ సిబ్బందితో వచ్చి తండావాసులకు జాతీయ రహదారిపై నుంచి పక్కకు నెట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్సై నర్సింహులు తెలిపారు. మృతుడికి భార్య లలిత, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గన్యతండాలో విషాదం... గణేశ్ నిమజ్జనం రోజునే ప్రమాదంలో ధారాసింగ్ మృతిచెందడంతో గన్యతండాలో విషాదం నెలకొంది.తండాలో గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి యువజన సంఘాల సభ్యులు,తండావాసులు సిద్ధమవుతున్నారు.ఈ తరుణంలో రోడ్డు ప్రమాదంలో దారాసింగ్ చనిపోయాడనే వార్తా తండావాసులను తీవ్రంగా కలచివేసింది.