పడకల్‌కు చేరుకున్న సావిత్రితో తల్లి పోసాని
సాక్షి, నిజామాబాద్(జక్రాన్‌పల్లి): పన్నెండేళ్ల తర్వాత తల్లీబిడ్డలు కలుసుకున్న ఉద్విగ్న క్షణాలవి.. ఒకరినొకరు తనివితీరా చూసుకున్నారు..ఆలింగనం చేసుకున్నారు.. కన్నీరుమున్నీరయ్యారు.. జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామంలో బుధవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన సావిత్రి రైలులో చెన్నై చేరగా అక్కడి రైల్వే పోలీసులు కోర్టుకు సరెండర్ చేశారు. కోర్డు ఆదేశాల మేరకు అధికారులు సావిత్రిని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆమె కూతురును బాలిక సంరక్షణ కేంద్రంలో చేర్పించి చదువు చెప్పించారు. సుదీర్ఘ చికిత్స అనంతరం సావిత్రి మామూలు స్థితికి రాగా అక్కడి వైద్యులకు తన వివరాలు తెలియ జేసింది. అక్కడి వైద్యులు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అం దించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జక్రాన్‌పల్లి తహసీల్దార్ కిషన్ సావిత్రి రాక కోసం కృషి చేశారు. కుటుంబీకులు చెన్నై వెళ్లి సావిత్రిని తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను సావిత్రి గుర్తు పట్టింది. గతం గుర్తుందో లేదోనన్న వారు అనుమానాలను నివృత్తి చేసింది.
గ్రామ సర్పంచ్ పుప్పాల శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు ఎస్ గంగారెడ్డి, వార్డు సభ్యులు అప్క సత్యం, సాయిలు ఇంటికి వెళ్లి సావిత్రి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ శ్రీనివాస్ సావిత్రికి ఆర్థిక సహా యాన్ని అందజేశారు. సావిత్రి భర్త లింగన్న గతంలో చనిపోయాడని కుటుంబీకులు తెలిపారు. సావిత్రికి ఇంటి నిర్మాణంతో పాటు పింఛను, రేషన్ సదుపాయం కల్పించాలని కుటుంబీకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment