తండ్రి మృతదేహం వద్ద విష్ణు
భోగాపురం: అస్వస్థతతో ఉన్న వ్యక్తిని మార్గమధ్యంలో దించేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, గుండెనొప్పితో బాధపడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలోచించిన ఆటో డ్రైవర్లు కలిసి ఒక నిండు ప్రాణం పోవడానికి కారకులయ్యారు. కళ్లముందే కన్నతండ్రి గుండెపట్టుకుని విలవిలలాడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కుమారుడు పడిన వేదన వర్ణనాతీతం. చూసిన వారు అయ్యో పాపం అన్నారే తప్ప సాయం చేసేవారే కరువయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద బుధవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పొన్నాడ అచ్యుత్ (50) ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన వారం రోజులుగా దగ్గుతో బాధపడుతున్నాడు. శ్రీకాకుళంలో వైద్యం చేయించినప్పటికీ తగ్గలేదు. దీంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేందుకు కుమారుడు విష్ణుతో బుధవారం ఆర్టీసీ బస్సు ఎక్కారు. భోగాపురం ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి అచ్యుత్ అస్వస్థతకు లోనయ్యాడు.
ఛాతీ నొప్పి వస్తోందని కుమారుడికి చెప్పాడు. దీంతో విష్ణు వెంటనే ఆస్పత్రి ఏదైనా ఉంటే ఆపాలని కండక్టర్‌ను కోరాడు. అయితే చాకివలస కూడలి వద్దకు వచ్చేసరికి అచ్యుత్‌కు నొప్పి ఎక్కువ కావడంతో డ్రైవర్ బస్సు ఆపి దించేశాడు. ఛాతీ నొప్పితో విలవిలలాడుతున్న ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటోవాలాలు తిరస్కరించారు. తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ముందుకు వచ్చాడు. కొంచెం దూరం వెళ్లగానే తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఎస్‌బీఐ బ్రాంచ్ వద్ద దించేశాడు.
అంతే కన్నకొడుకు చేతిలోనే ఆ తండ్రి చనిపోయాడు. సంఘటన స్థలానికి కూతవేటు దూరంలోనే ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. కిలోమీటరు దూరంలోనే సీహెచ్‌సీ ఉంది. బస్సు డ్రైవర్ బస్సును వెంటనే వెనక్కి తిప్పి సీహెచ్‌సీకి తీసుకెళ్లినా, ఆటో డ్రైవర్లు ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఒక నిండు ప్రాణాన్ని కాపాడేవారు. చుట్టూ ఎంతమంది ఉన్నా సాయం చేసేవారు లేకపోవడంతో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment