
ఆర్టీసీకి కుచ్చుటోపీ
- లో కొటేషన్ పేరుతో ప్రైవేటు బంకుల నుంచి డీజిల్ కొనుగోలు
- డీజిల్ నాణ్యత అంతంతే..
- అక్రమాలకు చోటు
- కొత్త విధానంతో ఆర్టీసీకి నెలకు రూ.21 లక్షల నష్టం
- ఆయిల్ కంపెనీల నుంచి సబ్సిడీతో నేరుగా కొనుగోళ్లే మేలు
పలమనేరు: ఇంధన పొదుపు వారోత్సవాలు, ఆదా చేసే డ్రైవర్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఆర్టీసీ నష్టాల బాటలోనే పయనిస్తోంది. పాత విధానాన్ని కాదని ప్రైవేటు బంకుల నుంచి లో కొటేషన్ పేరుతో డీజిల్‌ను కొనుగోలు చేస్తుండడంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. ఈ విధానం ప్రైవేటు బంకు యజమానులకు బంగారు బాతు గుడ్డులా మారింది. జిల్లాలో మొత్తం 14 డిపోలున్నాయి. వీటిలో ఏడు చిత్తూరు డివిజన్‌లో, మరో ఏడు తిరుపతి డివిజన్‌లో ఉన్నాయి. మొత్తం మీద 1,400 బస్సులు (ఆర్టీసీ అద్దె బస్సులు కాకుండా) ఈ డిపోల పరిధిలో ఉన్నాయి. ఈ బస్సులకు రోజుకు 1.26 లక్షల లీటర్ల డీజిల్ అవసరముంది. ఈ డీజిల్‌ను ప్రస్తుతం సంబంధిత డిపోల పరిధిలోని ప్రైవేటు బంకు ల నుంచి ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. ఈ కారణంగా జిల్లాలో నెలకు రూ.21 లక్షల నష్టం వాటిల్లుతోంది.
గతంలో ఆయిల్ కంపెనీల నుంచే కొనుగోలు
గతంలో ఆర్టీసీ బస్సులకు డీజిల్ పలు ఆయిల్ కంపెనీల నుంచి నేరుగా అందుతుండేది. దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారం రీజనల్ అధికారి స్థాయిలో జరిగేది. కంపెనీల నుంచి అందే డీజిల్ ఎంతో నాణ్యంగా ఉండేది. బస్సులకు మైలేజీ కూడా బాగా వస్తుండేది. సంబంధిత ట్యాంకర్లు ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి బయల్దేరే ముందు లాక్ చేసిన కీని అక్కడే ఉంచుకునేవారు. మరో కీ డిపోలకు అందించేవారు. దీంతో మార్గమధ్యంలో ఎటువంటి కల్తీకీ ఆస్కారముండేది కాదు. కార్పొరేషన్ ఈ విధానాన్ని గతేడాది ఆపేసింది. 2013 జవనరి నుంచి కొత్త విధానంతో డీజిల్ కొనుగోలు జరుగుతోంది.
కొత్త విధానం ఎలాగంటే
సంబంధిత డిపోలు ఆయా పరిధిలోని లో కొటేషన్ బంకు యజమానుల నుంచి డీజిల్‌ను పొందవచ్చు. ఈ కంపెనీలను ఎంపిక కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో డెప్యూటి చీఫ్ మెకానిక్ ఇంజినీర్, డెప్యూటి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, సంబంధిత డిపో మేనేజర్ సభ్యులుగా ఉంటారు. వీరు లో కొటేషన్ బిడ్డర్లను ఎంపిక చేస్తారు. వీరికి నిర్ణీత సమయమంటూ ఉండదు. మరో లో కొటేషన్ వచ్చిందంటే ఆ యజమాని నుంచి డీజిల్‌ను కొనుగోలు చేయవచ్చు.
కొత్త విధానంతో మొదటికే మోసం
లో కొటేషన్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్న బంకు యజమానులు ఆర్టీసీ డీఎంలకు ట్యాంకర్ తాళాలను ఇవ్వడం లేదు. దీంతో మార్గమధ్యంలో తమ బంకుల వద్ద ఈ డీజిల్‌ను కల్తీ చేసినా కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. కొందరు బంకు యజమానులు ఈ ట్యాంకర్లలో కిరోసిన్ కల్తీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. వీరు డిప్‌స్టిక్కులతో తనిఖీ చేసి మరీ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ యజమానులు కంపెనీ నుంచి నేరుగా ట్యాంకర్లను కొనుగోలు చేసి డిపోలకు పంపిణీ చేస్తున్నారు.
కొటేషన్‌తో కాంట్రాక్టు దక్కించుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ మాత్రం టంచనుగా అం దుతోంది. మామూలుగా ఫిల్లింగ్ స్టేషన్‌లో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 823 సాంద్రతతో డీజిల్ నింపుతారు. ఆపై ట్యాంకర్ డిపోకు చేరాక సంబంధిత అధికారులు డిప్‌స్టిక్ ద్వారా పరిశీలించి సాంద్రతలో మూడు పా యింట్లు తగ్గినా డీజిల్‌ను వెనక్కి పంపాల్సి ఉంది. సం బంధిత ప్రైవేటు బంకు యజమానికి ఆర్టీసీ కారణంగా మంచి లాభాలొస్తుండడంతో డిపో అధికారులకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి.
నెలకు రూ.21 లక్షల నష్టం
కొత్త విధానంతో ఆర్టీసీకి నెలకు రూ.21 లక్షల నష్టం వాటిల్లుతోంది. సంబంధిత బంకు యజమానులు కంపెనీల నుంచి లీటర్ డీజిల్‌ను రూ.63.03 పైసలకు పొంది సంబంధిత డిపోలకు రూ.63.63 పైసలకు సరఫరా చేస్తున్నారు. ఆర్టీసీకి 60 పైసలు తగ్గింపు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి లీటరుకు బంకు యజమానికి 1.20 పైసలు సబ్సిడీ అందుతోంది. ఇందులో 60 పైసలు తగ్గింపు పోయినా మరో 60 పైసలు లీటరుకు మిగిలినట్టే. ఆ లెక్కన రోజుకు 1.26 లక్షల లీటర్లకు రూ.75,600 బంకు యజమానులకు మిగులుతోంది. ఒక నెలకైతే రూ.22.68 లక్షలు చేరుతోంది. ఫలితంగా ఆర్టీసీ ప్రతి నెలా రూ.22.68 లక్షలు నష్టపోయినట్టే.