
శుక్రవారం చిత్తూరులో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై పోలీసుల లాఠీచార్జ్
హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు డిమాండ్ చేస్తూ.. ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజైన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉధ్రుతంగా సాగింది. కొన్ని చోట్ల పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తంగా మారింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. పురుషులు, మహిళలనే విచక్షణ లేకుండా తరిమి తరిమి చితకబాదారు. దీంతో యూనియన్ నేతలతో కలసి కార్మికులు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. మరోపక్క లాఠీచార్జ్ ఘటన జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనేలా చేసింది.
పలు జిల్లాల్లో బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు. సమ్మెకు మద్దతు పలుకుతున్న ప్రజాసంఘాల నేతల్ని కూడా అరెస్ట్ చేశారు. విజయనగరంలోనూ పోలీసులు రెచ్చిపోయారు. ఆర్టీసీ కార్మికులను విచ్చలవిడిగా అరెస్ట్ చేశారు. ఫలితంగా రోడ్డు రవాణా సమ్మె.. రాష్ట్రంలో పతాకస్థాయికి చేరింది. మరోపక్క, తాత్కాలిక ప్రాతిపదికన విశాఖపట్నం డిపోలో నియమితుడైన ఓ డ్రైవర్ రోడ్డు ప్రమాదానికి పాల్పడ్డాడు.
నేడు వంటా వార్పూ..: శనివారం ఏపీ వ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ఆవరణల్లోనూ ‘వంటా వార్పూ’ చేపట్టాలని యూని యన్ నే తలు పిలుపునిచ్చారు. కార్మికులపై పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా ఈయూ నేత కె.పద్మాకర్ ఆర్టీసీ డైరక్టర్ పదవికి రాజీనామా చేశారు.