
భవనంపై ఉన్న డ్రైవర్ సంతోష్
విజయనగరం అర్బన్: విధులు కేటాయించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ బుధవారం హల్‌చల్ చేశాడు. డిపో ప్రాంగణంలోని ఆర్టీసీ డిస్పెన్షనరీ భవనం పైకి ఎక్కి అక్కడ నుంచి దూకేస్తానని బెదిరించిన సంఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... ఆర్టీసీ విజయనగరం డిపో పరి«ధిలో అనకాపల్లి వెళ్లే అద్దె బస్సుకు సంతోష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆయనకు బుధవారం డ్యూటీ వేయలేదు. ముందురోజు ఎటువంటి అనుమతి లేకుండా డ్యూటీకి హాజరుకాకపోవడంతో మరుచటి రోజు డ్యూటీ వేయవద్దని ఆర్టీసీకి సిబ్బందిని బస్సు యజమాని కోరాడు. దీంతో ఆర్టీసీ అధికారులు అతనిడి డ్యూటీ వేయలేదు.
అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని.. డ్యూటీ వేయమని సంతోష్ కోరినా ఫలితం లేకపోయింది. దీంతో డ్రైవర్ సంతోష్ సమీప భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. దాదాపు గంటపాటు ఎవరు చెప్పినా వినలేదు. చివరకు డిపో మేనేజర్ బాపిరాజు వచ్చి సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో దిగి వచ్చాడు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ, అద్దె బస్సు డ్రైవర్లకు వారే డ్యూటీలు కేటాయిస్తామన్నారు.