ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ ఈ.శ్రీనివాసరావు
ఎవరికైనా కష్టం వస్తే పోలీసుల దగ్గరకువెళ్తారు. మరి పోలీసులకే సమస్య వస్తే...?ఏం చేయాలో తెలీక ఏకంగా ఆత్మహత్యాయత్నానికే పాల్పడ్డాడో కానిస్టేబుల్. పైగాఆయనకు ఇటీవలే పెళ్లయింది. కానీ స్టేషన్
లో పెద్దల వేధింపులు... నిరంతరం అవమానాలు... వ్యక్తిగత జీవితానికి దూరంచేస్తుండటం... ఇవన్నీ తట్టుకోలేక ఆయనఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. గతంలోనూ పెద్దల వేధింపులతో అవస్థలుపడిన దిగువస్థాయి పోలీసు సిబ్బంది రోడ్డెక్కిన సంఘటనలూ ఉన్నాయి. తాజాగాజరిగిన సంఘటన ఇప్పుడు ఏకంగాపోలీసుశాఖలోనే కలకలం రేపుతోంది.
సాక్షిప్రతినిధి విజయనగరం: జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో సీఐలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ వారి అండదండలతో దిగువస్థాయి సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నా రు. దీనిపై కొందరు బహిరంగంగా విమర్శలకు దిగుతుండగా.. కొత్తవలసలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఈ.శ్రీనివాసరావు విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో ఏకంగా ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అదృష్టవశాత్తూ ఈ సంఘటన చూసిన కొందరు ఆయన్ను కేజీహెచ్‌కు, అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం సెవెన్‌హిల్స్‌కుతరలించడంతో బతికి బట్టకట్టాడు. స్టేషన్‌లోని సీఐ రెడ్డి శ్రీనివాసరావు, రైటర్ సహాయకుడు పి.సత్యనారాయణ చేస్తున్న వేధింపులు తాళలేక గురువారం ఆత్మహత్యయత్నం చేసినట్లు విశాఖ మహారాణి పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం విశేషం. గతంలో ఓసారి కొత్తవలస పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు యత్నించాడని తాము అడ్డుకున్నామని సిబ్బంది చెబుతున్నారు. శ్రీనివాసరా వు కుటుంబ సభ్యులు కూడా సీఐ వేధింపుల వల్లే ఆత్మహత్య యత్నానికి పూనుకున్నాడని ఆరోపిస్తున్నా రు.
అసలేం జరిగిందంటే...
తెర్లాం మండలం గంగన్నపాడుకు చెందిన ఈ. శ్రీనివాసరావు విజయనగరం ఎస్‌పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) నుంచి నాలుగు నెలల క్రితం కొత్తవలస కానిస్టేబుల్‌గా విధుల్లో చేరా డు. ఈయనకు ఇటీవలే వివాహమైంది. భార్య రేణుకతో కలసి గోపాలపట్నంలో కాపురం ఉం టున్నాడు. కానీ ఉద్యోగరీత్యా తన స్నేహితులతో కలసి కొత్తవలసలోని ఓ ఇంట్లో ఉంటున్నారు. వారానికి ఒకటి రెండుసార్లు గోపాలపట్నంలో ఉంటున్న తన భార్య వద్దకు వెళుతున్నాడు. పెళ్లయినప్పటి నుంచి తనకు సెలవులు మంజూరు చేయకుండా కొత్తవలస పోలీస్ స్టేషన్‌లోని అసిస్టెంట్ రైటర్ సత్యనారాయణ, సీఐ రెడ్డి శ్రీనివాసరావు ఉదయం, సాయంత్రం విధులు కేటాయిస్తున్నారు. దీనివల్ల వివాహ జీవితాన్ని కోల్పోయానని తరచూ మదనపడుతుండేవాడు. తాజాగా దీపావళి రోజున కూడా డ్యూటీ వేయడంతోపాటు ఆ రోజు సాయంత్రం శ్రీనివాసరావును సీఐ తీ వ్రంగా తిట్టడమే గాకుండా స్టేషన్‌లో గల సిబ్బం ది, స్టేషన్‌కు వచ్చిన వారి ఎదురుగా అవమానిం చారు. దీంతో తీవ్ర మనస్తాపంతో గురువారం ఉదయం 9గంటల సమయంలో విశాఖపట్నం నోవాటెల్ ఎదురుగా గల బీచ్ రోడ్డుకు చేరుకుని అక్కడ ఫినాయిల్‌లో చీమల మందు కలుపుకుని తాగేశాడు. ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై గింజు కుంటుండగా స్థానికులు గమనించారు. తక్షణమే వారు అతడిని ఆటోలో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా శ్రీనివాసరావు భార్య రేణుక, ఇతర బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం సెవెన్‌హిల్స్‌కు తరలించారు. ఈ మేరకు బాధితుడు స్టేషన్ సీఐ రెడ్డి శ్రీనివాసరావు, అసిస్టెంట్ రైటర్ సత్యనారాయణ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించానని మహారాణిపేట పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
కొత్తవలస స్టేషన్‌లో గ్రూపుల గోల
కొత్తవలస స్టేషన్‌లో సీఐ రెడ్డి శ్రీనివాసరావు ఈ ఏడాది జూన్ 15న జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అక్కడ రెండు గ్రూపులు నడుస్తున్నాయి. స్టేషన్‌లో 43 కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ, సీఐతో కలసి 45 మంది ఉంటున్నారు. సీఐకి అనుకూలంగా ఉన్నవారికి స్టేషన్‌లో డ్యూటీలు, లేనివారందరికీ ఇతర డ్యూటీలు వేస్తున్నారని నైట్ డ్యూటీలు వేసినవారికి మళ్లీ డ్యూటీలు వేస్తున్నారని ఒక వర్గం ఆరోపిస్తోంది. సీఐతో పాటు సత్యనారా యణ కూడా తమను ఇష్టం వచ్చినట్లు తిడుతూ కేకలు వేస్తున్నారని కొందరు కానిస్టేబుల్స్ ఆవేదన చెందుతున్నారు. కొంతకాలంగా తాము తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నామని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్న సందర్భాలూ ఉన్నాయని అక్కడి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామంటే తమపై కక్షసాధింపు చర్యలు చేపడతారేమోనన్న భయంతో మౌనంగా భరిస్తున్నామని, లేడీ కానిస్టేబుళ్లని కూడా చూడకుండా అసభ్యపదజాలంతో దూషిస్తుంటారని సిబ్బంది అంటున్నారు.
సీఐపై ఆరోపణల వెల్లువ: సీఐ శ్రీనివాసరావుపై అనేక ఆరపణలు ఉన్నా యి. కొత్తవలసలో ఇటీవల ఖైనీగుట్కాలు అమ్ముతున్న వ్యక్తిని పట్టుకుని కేసులేకుండా చే సేందుకు బేరం కుదుర్చుకున్నారనీ, సంతపాలెం లో పశువధ చేసి మాంసం విక్రయిస్తున్న వారి కేసు మాఫీచేసేందుకు కొంత మొత్తం తీసుకున్నారని, కొత్తవలస, ఎల్‌కోట కర్మాగారాల లారీలు అనుమతులకు విరుద్ధంగా తిరుగుతున్నా వాటిౖ పె చర్యలు తీసుకోకుండా ఏదో ఒప్పందం కుదుర్చుకున్నారనీ, క్వారీల నిర్వాహకులతోనూ కు మ్మక్కవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నా యి. అయితే ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి(టీడీపీ) అండదండలు పుష్కలంగా ఉండటం వల్లనే ఈయన హవా సాగుతోందని సీఐపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఇటీవల రామలింగపురం గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో సీఐ ప్రత్యక్షంగా తలదూర్చి టీడీపీ నాయకులకు అండగా నిలబడ్డారని చెబుతున్నారు.
విధులకు హాజరు కమ్మంటే వేధిస్తున్నామంటున్నారు
ఈ. శ్రీనివాసరావు సక్రమంగా డ్యూటీలకు హాజరు కావటంలేదు. గతంలో కూడా ఇలాగే ఆయన ఆత్మహత్య ప్రయత్నాలు చేసినట్లు మావద్ద ఆధారాలు ఉన్నాయి. అతని నడవడిక సరిగా లేకపోవడం వల్ల ఇంట్లో తలెత్తిన సమస్యల కారణంగా ఆత్మహత్యా యత్నం చేశాడే తప్పా మరేమీ లేదు. డ్యూటీలు చేయమంటే వేధిస్తున్నారంటూ సిబ్బంది ఆరోపించడం మంచిది కాదు. సిబ్బంది చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఎవరిదగ్గరా నేను లాలూచీ పడలేదు.– రెడ్డి శ్రీనివాసరావు, సీఐ
Comments
Please login to add a commentAdd a comment