ఆర్టీసీ సమ్మె తొలిరోజు విజయవంతం
డిపోలకే పరిమితమైన బస్సులు
తాతాల్కిక ఉద్యోగులతో నడిపేందుకు అధికారుల యత్నం
అడ్డుకున్న కార్మికులు, సంఘాల నాయకులు
చార్జీల మోత మోగించిన ప్రైవేట్ వాహనదారులు
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
ఫిట్‌మెంట్ సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె జిల్లాలో తొలిరోజు విజయవంతమైంది. రోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తాతాల్కిక ఉద్యోగులతో బస్సులు నడిపేం దుకు అధికారులు చేసిన ప్రయత్నం కార్మికులు అడ్డుకోవడంతో విఫలమైంది. మొత్తంమీద జిల్లాలోని అన్నిచోట్ల బస్సులు రోడ్డెక్కలేదు. సమ్మెతో ఆర్టీసీకి భారీ నష్టం జరగగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనాలు చార్జీల మోత మోగించాయి.
పట్నంబజారు(గుంటూరు) : ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) పిలుపు మేరకు కార్మికులు బుధవారం అర్ధరాత్రి నుంచే జిల్లాలోని అన్ని డిపోల్లో సమ్మెకు దిగారు. ఈయూకు మరో ప్రధాన కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ), ఇతర కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. కార్మికులందరూ సమ్మెలో ఉండడంతో గ్యారేజీల నుంచి బస్సులు బయటకు రాలేదు. ఉదయం 6 గంటల నుంచే కార్మికులంతా బస్టాండ్‌కు చేరుకుని గ్యారేజీ నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు.
మధ్యాహ్నం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, వివిధ కార్మిక సంఘాల నాయకులు సమ్మెకు సంఘీభావాన్ని తెలియజేసి, కార్మికులకు బాసటగా నిలిచారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రీజియన్ పరిధిలో ఒక్క బస్సు తిరగనివ్వకుండా అడ్డుకున్నామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఉదయం నుంచి ఆర్టీసీ అధికారులు బస్సులు బయటకు తెచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలను కోరినా ప్రయోజనం కనిపించలేదు.
పలుమార్లు బస్సులను బయటకు తీసే ప్రయత్నం చేయడంతో కార్మికులు అడ్డుకున్నారు. మధ్యాహ్న సమయంలో పోలీసులు కార్మిక సంఘాల నాయకులతో చర్చించినా ససేమిరా అన్నారు. కార్మిక సంఘాల నేతలు, కార్మికులను అక్కడ నుంచి బలవంతంగా పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు బస్టాండ్ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు ప్రతిఘటనతో తోపులాట జరిగింది.
అనంతరం నేతలను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించి, అదుపులోకి తీసుకుని, గ్యారేజీ నుండి బస్సులను బయటకు పంపారు. ప్రతి బస్సుకి ఒక కానిస్టేబుల్‌ని సహాయంగా పంపారు. ఈస్ట్ డీఎస్పీ సంతోష్ బందోబస్తును పర్యవేక్షించారు. హయ్యర్ బస్సు తీసుకుని వెళ్లే క్రమంలో బస్సు యజమాని మహిళ కార్మికుడిపై చేయి చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సర్దిచెప్పడంతో ఇరువర్గాలు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. రీజియన్ పరిధిలో 102 హయ్యర్, 22 ఆర్టీసీ కలిపి 126 బస్సులు రీజయన్ పరిధిలో తిరిగాయి.
దీంతో 1150 బస్సులు డిపోలకే పరితమయ్యాయని అధికారులు తెలిపారు. విజయవాడ, తెనాలి, అమరావతి, పర్చూరు. చిలక లూరిపేట, నరసరావుపేటకు బస్సులు తిప్పినట్లు చెప్పారు. గురువారం పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు అధికారులు దృష్టి సారిస్తున్నారు. సమ్మె ప్రభావంతో రీజయన్‌కు రూ.కోటికి పైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు బస్సులు లేక ఆటోలు, కార్లను ఆశ్రయించారు. నిత్యం కళకళలాడే బస్టాండ్‌లు వెలవెలబోయాయి. దుకాణాలు సైతం వ్యాపారాలు లేకపోవడంతో మూసివేశారు.
ప్రైవేట్ బస్సులు హవా..
గుంటూరు నుంచి దూరప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల వైపు మొగ్గు చూపారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ యాజమాన్యాలు కాసుల పండుగ చేసుకున్నాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, తిరుపతి తదితర ప్రాంతాల బస్సు టికెట్టుపై రూ.200 నుంచి రూ.500 వరకు అధికంగా తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బస్సులు నడిపేందుకు ఆర్టీసీ తాత్కాలిక నియామకాలు చేపట్టింది. కండక్టర్, డ్రైవర్ విధులు నిర్వహణకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. 150 మంది కండక్టర్లు, 40 మంది డ్రైవర్లు వచ్చారు.
ఆ డ్రైవర్ల అనుభవ రాహిత్యం బట్టబయలైంది. లెసైన్స్ కలిగిన 40 మందిని తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. వారిలోని డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తున్న సమయంలోనే ఒక బస్సు రోడ్డు పక్కన బాటసారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన పాత బస్టాండ్ సెంటర్లోని కింగ్స్ హోటల్ సమీపంలో జరిగింది. ప్రమాదంలో ఎలాంటి నష్టం కలగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
కదలని చక్రం
Published Thu, May 7 2015 4:05 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement