ఇరువురి ప్రాణం తీసిన సమ్మె!
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్/లాలాపేట్ : ఆర్టీసీ సమ్మె కారణంగా నగరంలో సోమవారం వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. తార్నాకలో ఆర్టీసీ అద్దెబస్సు ఢీకొని ఓ ఎంబీఏ విద్యార్థిని దుర్మరణం పాలవగా...మౌలాలీ స్టేషన్ సమీపంలో ఓ మహిళ రైల్లోంచి జారి పడి మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే... మౌలాలీ హౌసింగ్‌బోర్డుకు చెందిన అభిషేక్ (21) స్నేహ (19)లు బైకుపై మౌలాలీ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా, తార్నాక రైల్వే డిగ్రీ కళాశాల సమీపంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు (ఏపీ 11వి 3693) ఢీకొంది. దీంతో బైక్ వెనక కూర్చున స్నేహ ఒక్కసారిగా ఎగిరి బస్సు వెనుక చక్రాల కింద పడి మృతి చెందింది. బస్సు డ్రైవర్ వెంకటయ్య ఒత్తిడిలో విధులు నిర్వహిస్తూ...ప్రమాదానికి కారకుడయ్యాడని విమర్శలు వచ్చాయి.
ఇక విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబంతో కలిసి శ్రీకాకుళం నుంచి నగరానికి వస్తున్న అన్నపూర్ణ (32) మౌలాలీ స్టేషన్ సమీపంలో రైల్లోంచి జారి కింద పడి మృతి చెందింది. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి. రిజర్వేషన్‌లు లభించని ప్రయాణికులు జనరల్ బోగీలను ఆశ్రయిస్తున్నారు. అలా విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన అన్నపూర్ణ మౌలాలీ సమీపంలో తన ఎనిమిదేళ్ల కొడుకును టాయిలెట్‌కు తీసుకెళ్లే క్రమంలో రద్దీని దాటుకుంటూ వెళ్తుండగా...జారి పడి ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులు లేక రైల్వే స్టేషన్‌లో రద్దీ పెరగడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని తోటి ప్రయాణికులు చెప్పారు.
ఒత్తిడే కారణమా....
సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు పట్టుదలగా బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ బస్సులు నడపాలనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ డ్రైవర్‌లపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు కూడా ధనార్జనే లక్ష్యంగా నిబంధనలను తుంగలోతొక్కి సిబ్బందిపై భారాన్ని పెంచుతున్నారు. ఈ క్రమంలో రోజుకు 4 ట్రిప్పులు కూడా నడపలేని డ్రైవర్లు ఏకంగా ఐదారు ట్రిప్పులు తిప్పుతున్నారు. తార్నాక బస్సు ప్రమాదానికి కారణమైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన డ్రైవర్ సిహెచ్ వెంకటయ్య గత 14 ఏళ్లుగా అద్దె బస్సు నడుపుతున్నట్లు సమాచారం.
అనుభవం లేని డ్రైవర్ వల్లే ప్రమాదం
గత వారం రోజుల నుంచి ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మణికంఠ ఆరోపించారు. ప్రత్యామ్నాయ మార్గాల పేరుతో ప్రభుత్వం అనుభవం లేని వారి ద్వారా బస్సులు నడపడం ద్వారానే ప్రమాదాలు చోటుచేసుకంటున్నాయని, సోమవారం ఘటన అలాంటిదేనని ఆయన పేర్కొన్నారు.