ఆయిల్ ట్యాంకర్ లో మంటలు
ఘట్‌కేసర్: ఎండ తీవ్రతకు ఓ ఆయిల్ ట్యాంకర్ ఇంజిన్‌లోంచి మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. లారీ క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్‌తో సహా 8 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి ఆయిల్ ట్యాంకర్ మండల పరిధిలోని అంకుశాపూర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుంచి శుక్రవారం సాయంత్రం 5 వేల లీటర్ల పెట్రోలు, 15 వేల లీటర్ల డీజిల్‌తో శివరాంపల్లిలోని సుప్రజ ఫిల్లింగ్ స్టేషన్‌కు బయలుదేరింది. డ్రైవర్ రాజేష్, క్లీనర్‌తో పాటు మరో ఆరుగురు వాహనంలో ఉన్నారు. మార్గమధ్యలో మండల కేంద్రంలోని మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ రాజేష్ మిగతా వారిని అప్రమత్తం చేశాడు.
వారంతా నడుస్తున్న ట్యాంకర్ నుంచి దూకేశారు. డ్రైవర్ రాజేష్ వాహనానికి ఆపి దిగాడు. క్షణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంజిన్, క్యాబిన్ పూర్తిగా కాలిపోయాయి. రాజేష్ వెంటనే హెచ్‌పీసీఎల్ సంస్థ వారికి సమాచారం ఇచ్చారు. వారు ఫైర్ ఇంజిన్‌ను ఘటనా స్థలానికి పంపించారు. ముందు జాగ్రత్తగా నగరంలోని అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలు కొద్దిసేపటికి అదుపులోకి వచ్చాయి. ట్యాంకర్‌లోని డీజిల్, పెట్రోల్‌కు నిప్పు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, హెచ్‌పీసీఎల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు.