కదలని బస్సులు
మెట్టుదిగని కార్మికులు
పోలీసులు వర్సెస్ కార్మికులు
ఎంసెట్ కోసం రోడ్డుపైకి బస్సులు
బస్సుల్లో కండక్టర్ల దోపిడీ
సమ్మెకు ప్రతిపక్ష, వామపక్ష పార్టీల మద్దతు
మూడు రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికుల జోరు తగ్గలేదు. శుక్రవారం ఉదయం నుంచి రీజియన్ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలతో హోరెత్తించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తారంటూ...కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దాదాగాంధీ, నాగరాజు, ఎస్‌యుసీఐ సుబ్రమణ్యం, కార్మిక మహిళ ఫోరం జిల్లా కన్వీనర్ శకుంతల, సీపీఐ లింగ మయ్య మద్దతు తెలిపారు. కదిరిలో కార్మికులు చేపడుతున్న సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మద్దతు ప్రకటించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్మికుల వ్యతిరేకి సీఎం చంద్రబాబు నాయుడంటూ విమర్శించారు.
హిందూపురంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. గురువారం కార్మికులపై పోలీసులు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. కళ్యాణదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్ రెడ్డి, తిప్పేస్వామి సమ్మెలో పాల్గొని ప్రభుత్వం తీరును తప్పబట్టారు. కార్మికులను రోడ్డుపాలు చేసి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రజా సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీఎం ప్రవర్తిస్తున్నారని...ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయన్నారు.
ధర్మవరం, పుట్టపర్తి, గుంతకల్లు, మడకశిర, తదితర డిపోల్లో సమ్మె యథాతతంగా జరిగింది. యాజమాన్యం ఫిట్‌మెంట్ ప్రకటించే వరకు మెట్టుదిగేది లేదంటూ కార్మికులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక నేతలు కొండయ్య, భాస్కర్‌నాయుడు, వెంకటేశ్, వీఎన్ రెడ్డి, గోపాల్, వైకే మూర్తి, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కార్మికులు
సమ్మెను అణచివేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రీజియన్ వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేపడుతున్న కార్మికులను రెచ్చగొట్టేలా పోలీసులు వ్యవహరించారు. జిల్లా కేంద్రంలో కర్నూలు సర్వీసులో కండక్టర్ ఒక్క టికెట్ కూడా కొట్టకుండా వచ్చాడు. అనంతపురం పరిసర ప్రాంతంలో స్వ్కాడ్ సదరు కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు ఒక్క రూపాయి తేడా వస్తే కేసు రాస్తారే రూ.వేలు దండుకుంటుంటే ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
దీనిపై పోలీసులు జోక్యం చేసుకుని అది అధికారులు చూసుకుంటారనడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. కాసేపు పోలీసులు, కార్మికుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై వెంకటరమణ అత్యుత్సాహం ప్రదర్శించారు. కార్మికులను భయాందోళనకు గురి చేసేలా మాట్లాడారు. ఇదిలా ఉండగా బస్సుల్లో కండక్టర్ల దోపిడీ మొదలైంది. టికెట్లు కొట్టకుండా జేబులు నింపుకుంటున్నారు. రీజియన్‌లోని రాయదుర్గం, తాడిపత్రి, కళ్యాణదుర్గం తదితర చోట్ల కండక్టర్లు టికెట్లు సరిగా ఇవ్వడం లేదు. అందినకాడికి దోచుకుంటున్నారు.
రోడ్డెక్కిన బస్సులు
ఎంసెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఉదయం మాత్రం కార్మికులు ఆందోళనలు చేపట్టలేదు. ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను తిప్పింది. శుక్రవారం బస్టాండ్‌లో కొన్ని బస్సులు దర్శనమిచ్చాయి. కానీ అనేక చోట్ల బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తల్లిదండ్రులే దగ్గరుండి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. ఇక డీజిల్ ఆటోలు అందినకంత దోచుకున్నాయి. అధిక రేట్లతో వాహనాలు నడిపారు. దీంతో విద్యార్థులు గత్యంతరం లేక ప్రయాణించారు.
370 బస్సులు తిప్పిన ఆర్టీసీ
శుక్రవారం 370 బస్సులను తిప్పినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జీ వెంకటేశ్వర రావు చెప్పారు. ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అందుబాటులో 220 మంది డ్రైవర్లు, కండక్టర్లున్నారన్నారు. కండక్టర్లు దోపిడి చేసేందుకు యత్నిస్తే చర్యలు తప్పవన్నారు. ఇవాల బస్సులు అధిక సంఖ్యలో తిప్పామని, రాబోయే రోజుల్లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.