తప్పతాగి అధికార పార్టీ కార్యకర్త నంటూ ఆస్పత్రిలో వీరంగం
చికిత్స కోసం వచ్చిన రోగులు, సిబ్బందిపై దురుసు ప్రవర్తన
వైద్యాధికారికి ఫిర్యాదు, పోలీసులకు అప్పగింత
పోలాకి:పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటెండర్‌గా పని చేస్తున్న లక్ష్మణదాస్ శుక్రవారం విధుల్లో ఉండగా నే తప్పతాగి ఆస్పత్రిలో హల్‌చల్ చేశా డు. నేను మినిస్టర్ మనిషినని.. నన్ను ఎవడూ ఏమీ పీకలేడంటూ కాసేపు వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళి తే... మధ్యాహ్నం ఒంటిగంట సమయం లో వెదుళ్లవలసకు చెందిన బేపల క్రిష్ణ తన కుమార్తె నాగమణి సహాయంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో పోలాకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డి.లక్ష్మణరావు అక్కడకు వచ్చి సదరు రోగి పరిచయస్తుడు కావటంతో వారికి తోడుగా ఉన్నాడు.
అప్పటికే తప్పతాగి ఉన్న అటెండర్ లక్ష్మణదాస్ ఆస్పత్రికి రావటానికి టైము..పాడు ఉండదా? అంటూ వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఉపాధ్యాయుడిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో అడ్డుకున్న సిబ్బందిపై కూడా బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. వైద్యాధికారి టేబుల్‌పై ఉన్న కాగితాలు చింపేయడమే కాకుండా..మీరే చింపేశారంటూ బెదిరిం చాడు. ఈ విషయాన్ని వైద్యాధికారి శిమ్మ ఇందుసింహకు లక్ష్మణరావు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మీడియా, వైద్యాధికారి సమక్షంలో కూడా నేను అధికార పార్టీ కార్యకర్తను అంటూ రెండువేళ్లు చూపుతూ అక్కడున్న చంద్రబాబు ఫొటో ముందు లక్ష్మణదాస్ డాన్స్ చేశాడు. కాసేపు వైద్యాధికారి గదిలోనే పడుకుని మత్తువదిలే వరకు ఉండి తరువాత బయటకు వచ్చాడు. అప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో తాగుబోతు అటెండరును పోలీసులకు అప్పగించారు.
నిత్యం ఇదేతంతు
సదరు అటెండర్ విధులకు రోజూ మద్యం సేవించి రావటమే కాకుండా దురుసుగా ప్రవ ర్తిస్తుంటాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఒక్కోసారి వైద్యాధికారిని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన సందర్భాలున్నాయని, అయినా భరిస్తూ వస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై లిఖితపూర్వంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని వైద్యాధికారి ఇందుసింహా తెలిపారు.
ఖండించిన ఉపాధ్యాయ సంఘాలు
మానవతా దృక్పథంతో ఆస్పత్రికి వెళ్లిన ఉపాధ్యాయుడిపై అక్కడి అటెండర్ తప్పతాగి దాడి చేయటాన్ని మండలంలోని ఉపాధ్యాయసంఘనాయకులంతా ఖండించారు. ఈ సంఘటనను సంబంధిత శాఖాధికారులు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ కార్యకర్తనంటూ బెదిరిస్తే ఊరుకునేదిలేదని సంఘ నాయకులు కె.ఆదినారాయణ, బాడాన రాజు అన్నారు.
అటెండర్ హల్‌చల్ !
Published Fri, Jul 24 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement
Advertisement