
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కరాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌ను శనివారం కలిసి జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను జన్మభూమి కార్యక్రమం ప్రారంభించేలోగా పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మడకశిర, కళ్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, పంట నష్ట పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ బిల్లులు రాక వేలాదిమంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు.
సీఎంఓ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీ కోసం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలు లక్షల్లో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. అయితే అవేవీ పరిష్కారం కావడం లేదని రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలులోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ పథకాలకు పేదరికం అర్హతగా చూడడం లేదని, అధికార పార్టీకి చెందిన వారికే అందుతున్నాయని ఆరోపించారు. ఇతర పార్టీల వారికి ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. జన్మభూమి ప్రారంభమయ్యేలోగా సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాటాలు సాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు కోట సత్యనారాయణ, నగర అధ్యక్షుడు దాదాగాంధీ ఉన్నారు.