ప్రభుత్వాల తీరును ఎండగడతాం
అనంతపురం సప్తగిరి సర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానానులు ఎండగడతామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అవలంభిస్తోన్న బీజేపీ లౌకికత్వానికి తూట్లు పొడుస్తోందన్నారు. యూపీలో బీజేపీ తరఫున ఒక్క ముస్లింకు కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ర్టంలోని టీడీపీ ప్రభుత్వం కూడా ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కేటాయించకుండా ఆ వర్గాన్ని మోసం చేసిందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ విధానంతో ప్రజల ముందుకు వెళ్తున్నాయో రాజకీయ పార్టీలన్నీ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
విభజన చట్టంలోని హామీలన్నీ విస్మరించారు
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీలు ఆనాడు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలును పూర్తిగా విస్మరించాయని రఘువీరారెడ్డి మండిపడ్డారు. విభజించి పాలించడం కాంగ్రెస్ విధానం కాదన్నారు. అట్టడుగున ఉన్న వారికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గ్యాస్ ధరను పెంచితే మోదీ, జైట్లీ, చంద్రబాబులు నెత్తినోరు కొట్టుకున్నారనీ...ఇపుఽడు వారే ధరలు పెంచుతూ సామాన్యున్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రభుత్వాల తీరును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అంతకుముందు జాతీయపతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పీసీసీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, నగర అధ్యక్షుడు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు.