‘దొర’బాబులూ కొండ దిగాల్సిందే!
తిరుమల కొండపై తిష్టవేసిన దొరబాబుల బదిలీలకు రంగం సిద్ధం
కీలక స్థానాల కోసం జోరందుకున్న పైరవీలు
కుదరదంటున్న అధికారులు
అటెండర్‌ను కదిలించాలన్నా అమాత్యుల నుంచి ఫోన్లు
సాక్షి, తిరుమల : తిరుమల కొండపై దీర్ఘకాలంగా తిష్టవేసి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేం దుకు రంగం సిద్ధమైంది. ఇటీవల దర్శన వ్యాపారం చేస్తూ వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో ఇద్దరు ఉద్యోగులు, భక్తుల కానుకలు అపహరిస్తూ మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు పట్టుబడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆలయ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యల్ని వేగవంతం చేశారు. మరోవైపు తమ బదిలీలను ఆపుకునేందుకు, కొత్త పోస్టుల్లో తిష్టవేసేందుకు రాజధాని స్థాయి నుంచి పైరవీలు జోరందుకున్నాయి. అందుకు ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నా.. అనుకున్న విధంగా అమలు చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కొండపై కీలక విభాగాల జాబితాపై ఉన్నతాధికారుల కసరతు
తిరుమలలో ఇటీవల వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లో సూపరింటెండెంట్, మరో అసిస్టెంట్ షరాబు కాంట్రాక్టు ఉద్యోగితో కలిసి రూ.300 టికెట్లతో అక్రమ వ్యాపారాలు సాగిస్తూ పట్టుబడ్డారు. అలాగే స్వామి సన్నిధిలోనే భక్తులు వేసిన కానుకల్ని చాకచక్యంగా అపహరిస్తూ ఇద్దరు మహిళా ఉద్యోగులు సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. రిసెప్షన్ విభాగాల్లో ఉద్యోగులు కొం దరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ఆధారాలతోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వారు ఈ విషయాల్ని తీవ్రంగా పరిగణించి దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని భావించారు.
ఈ నేపథ్యంలో దశలవారీగా ఉద్యోగులను బదిలీ చేయాలని కసరత్తు ఆరంభించారు. తిరుమలలో వివిధ శాఖల్లో ఆరోపణలు ఉన్నవారు, రెండేళ్ల పదవీ కాలం నిండినవారిని స్థాన చలనం చేయడం ఉత్తమమని భావిస్తున్నారు. దీని వల్ల అవినీతి ఆరోపణలు కొంతమేర తగ్గించడం, అక్రమాలకు అడ్డుకట్టవేసే అవకాశాలుంటాయనే భావనలో ఉన్నధికారులు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అటెండర్ స్థాయి నుంచి అధికారుల స్థాయి వరకు జాబితాను సిద్ధంచేసే పనిలో పడ్డారు. ఇదే రీతిలో పైరవీలూ జోరందుకున్నాయి. అందుకు ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నట్టు సమాచారం.
కీలక స్థానాల్లో కదిలిస్తే అమాత్యుల స్థాయిలో పైరవీలు
తిరుమలలో ప్రధానంగా శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంపెక్స్, రిసెప్షన్ విభాగం, ధర్మకర్తల మండలి చైర్మన్, బోర్డు సభ్యుల వద్ద పనిచేసేందుకే అధిక శాతం ఉద్యోగులు మొగ్గు చూపుతారు. ఇక్కడ సీటు సంపాదించేందుకు తమతమ సామాజిక వర్గాలకు చెందిన అమాత్యుల నుంచి రాష్ర్ట రాజధానిలోని ముఖ్య పేషీ వరకు పైరవీలు సాగిస్తారు. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో టీటీడీలో పెరిగిపోయింది. పోస్టులో చేరిన వ్యక్తి రెండు కాదు.. ఐదారేళ్లు ముగిసినా తిరిగి మరోచోటుకు బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో? అర్థమవుతోంది.
కీలక స్థానాల్లో పనిచేసే కొందరిని కదిపితే తమ స్థానాలకే ఎసరు పెడతారేమో? అన్న సందేహాన్ని ఉన్నతాధికా ఒకరు వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శనం. అటెండర్ స్థాయి బదిలీ విషయంపై మాట్లాడితే ఏకంగా తన సెల్‌ఫోన్ నుంచే హైదరాబాద్‌లో ఉన్న మంత్రితోనో, మరో ముఖ్యపేషీలోని ఉన్నతాధికారితోనో నేరుగా మాట్లాడించే పరిస్థితి ఎదురువుతోంది.. అని మరో ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. తీవ్ర ఒత్తిడుల నడుమ పారదర్శకమైన బదిలీలు సాధ్యమా? అన్నదీ ప్రశ్నార్థకమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు అనుకున్న విధంగానే తిరుమలకొండపై తిష్టవేసిన దొరబాబులను కొండ దించుతారా? అన్నది వేచి చూడాలి మరి.