రూ.100 కోట్లు ఏమూలకు? | Rupes 100 crores | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్లు ఏమూలకు?

Published Sat, Sep 6 2014 3:14 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

Rupes 100 crores

సాక్షి, అనంతపురం : అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పెండింగ్‌లో ఉన్న మొదటి దశ పనులను పూర్తి చేసి ‘అనంత’ ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి జిల్లా మంత్రులు పల్లె, పరిటాల సునీతలు సమావేశాల్లో ఊదరగొడుతున్నా ఈ పథకాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కోట్లాది రూపాయలు ఈ పథకం కోసం వెచ్చించి పనులను చకచకా చేయించారు. అప్పట్లోనే మొదటి, రెండో దశ పనులు చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగాయి. వైఎస్ మరణానంతరం సీఎంగా వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో బొటాబోటి నిధులు విడుదల చేసి చివరకు మొదటి దశ పనులను 90 శాతం వరకు పూర్తి చేశారు. ప్రస్తుతం 10 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.  
 
 కేటాయింపు రూ.100 కోట్లు
 మొదటి దశ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రూ.350 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఆ మేరకైనా నిధులు విడుదల చేస్తారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నిండింది. ఎక్కువైన నీటిని దిగువ ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి హంద్రీ-నీవా ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం 2 టీఎంసీలకు మాత్రమే జీవో తీసుకొచ్చి ఈ మేరకు నీటిని జీడిపల్లి రిజర్వాయర్‌కు ఆగస్టు 2న విడుదల చేయించారు. గత ఏడాది 9 టీఎంసీల దాకా ప్రభుత్వం నీటిని తీసుకువచ్చింది. తుంగభద్ర జలాశయం నుంచి రావాల్సిన నీటి కోటాలో కూడా గండి పడుతుండగా, హంద్రీ-నీవా నీటిని తీసుకురావడంలో వైఫల్యం కనిపిస్తోంది. శ్రీశైలం నుంచి రెండు టీఎంసీలు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించినా నీటి ఆవిరి, జల చౌర్యం, పూడిక తదితర కారణాలతో జీడిపల్లి రిజర్వాయర్‌కు ఒకటిన్నర టీఎంసీకి మించి వచ్చే అవకాశం లేదు.
 
 565 కిలోమీటర్ల మేర మెయిన్ కెనాల్
 రాయలసీమలోని నాలుగు జిల్లాలకు హంద్రీ-నీవా పథకం ద్వారా 6 లక్షల 25 వేల ఎకరాలకు సాగు నీరు, 33 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని 40 టీఎంసీల సామర్థ్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. 565 కిలోమీటర్ల పొడవుతో మెయిన్ (హంద్రీ నుంచి నీవా వరకు) కెనాల్‌ను రూపొందించారు. ఆగస్టు నుంచి నవంబర్ వరకు 120 రోజులు శ్రీశైలం రిజర్వాయర్‌లో వరద ప్రవాహం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా నీటి విడుదల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలం రిజర్వాయర్‌లో జనవరి వరకు వరద ఉండడంతో జనవరి వరకు నీటిని జీడిపల్లి రిజర్వాయర్‌కు తీసుకువచ్చింది. ఏవీఆర్ హంద్రీ-నీవా పథకం మొదటి, రెండో దశల్లో కలుపుకుని కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 3.45 లక్షలు, వైఎస్‌ఆర్ జిల్లాలో 35,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.45 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టు మొత్తం రూ.6,850 కోట్లతో అంచనా వేయగా.. ధరలు, ఖర్చులు పెరగడంతో మొదటి దశ రూ.2,774 కోట్లు, రెం డో దశకు రూ.4,976 కోట్లుతో మొత్తంగా రూ.7,750 కోట్లు గత ప్రభుత్వం నిర్ణయించింది.
 
 ఏ మేరకు నిధులు ఖర్చు పెడుతారో?
 గత ప్రభుత్వం పాలన చివర్లో ఎత్తిపోతల పథకానికి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ..పనుల పురోగతికి ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకు మొదటి దశ పనులు పూర్తి చేయడానికి రూ.350 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. మొదటి దశలో రోడ్డు క్రాసింగ్‌లు, రైలు బ్రిడ్జి క్రాసింగ్‌లు, అటవీ శాఖ అనుమతులు చాలా చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి.
 
 అప్పటి ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాట్లతో జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటిని తీసుకువచ్చింది. మొదటి దశ, రెండో దశలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. దీంతో పాటు ఉప కాలువలను పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 2014-15కు రెండో దశ పనుల్లో భాగంగా కదిరి సమీపంలోని గొల్లపల్లి, బుక్కపట్నం మండల సమీపంలోని మారాల రిజర్వాయర్లు పూర్తి చేసి వాటి ద్వారా చెరువులకు నీరు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
 ఇందు కోసం రూ.450 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశారు. 2015-16 నాటికి ఫేజ్-2 కెనాల్‌ను మారాల రిజర్వాయర్ నుంచి అడవిపల్లి రిజర్వాయర్ వరకు పూర్తి చేసి నీటిని ఇవ్వాలని లక్ష్యంగా రూ.400 కోట్లు అవసరం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2016-17 నాటికి హంద్రీ-నీవా పథకాన్ని పూర్తి చేయడమే కాకుండా మడకశిర, తంబళ్లపల్లి, మదనపల్లె, పుంగనూరు నీవా బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
 
 ఈ క్రమంలో రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించిన సమయంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ హంద్రీ-నీవాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నీరందిస్తామని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో ‘అనంత’పై వరాలు కురిపించారు. రుణ మాఫీకే డబ్బులు లేక జుట్టు పీక్కుంటున్న ప్రభుత్వం చాంతాడంత జాబితాలో పేర్కొన్న హామీలకు నిధుల సంగతేంటని అనంత వాసులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో హంద్రీ-నీవాకు ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు సరిపోతాయని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement