
సాక్షి, విజయనగరం : కరోనా వైరస్ ప్రతాపానికి ప్రజాప్రతినిధులు సైతం తలవంచక తప్పడంలేదు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు వైరస్ బారినపడ్డారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం ఒక్కరోజే జిల్లాలో 21 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 162కి చేరింది. తాజాగా రెవెన్యూ శాఖలోనూ వైరస్ ప్రవేశించింది. జిల్లాలోని ఓ డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే.