మళ్లీ చక్రం తిప్పిన 'పచ్చ' బ్యాచ్‌! | Sadavarti Satram lands Second Auction | Sakshi
Sakshi News home page

మళ్లీ చక్రం తిప్పిన 'పచ్చ' బ్యాచ్‌!

Published Mon, Sep 18 2017 5:33 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

సదావర్తి సత్రం భూములు.. ఇన్‌సెట్‌లో బద్వేలు శ్రీనివాస్‌ రెడ్డి

సదావర్తి సత్రం భూములు.. ఇన్‌సెట్‌లో బద్వేలు శ్రీనివాస్‌ రెడ్డి

సదావర్తి సత్రం భూములను తాజా వేలంలోనూ దక్కించుకున్న టీడీపీ
మరింత ధర వచ్చేదంటున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు



సాక్షి, హైదరాబాద్‌: సదావర్తి సత్రం భూములను టీడీపీ నాయకులు వదిలేట్టు కనబడటం లేదు. ఆరంభం నుంచి ఈ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు కుట్రలు చేసిన అధికార పార్టీ నాయకులు తాజా వేలంలోనూ తమ 'పాటవం' ప్రదర్శించారు. తమ అనుచరుడి ద్వారా సత్రం భూములను దక్కించుకున్నారు. రెండోసారి నిర్వహించిన వేలంలోనూ భూములు చేజారిపోకుండా చక్రం తిప్పారు.

కారు చౌకగా కొట్టేయాలని..
వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను మొదట రూ. 22 కోట్లకు తమ పార్టీ నాయకుడికి చంద్రబాబు సర్కారు కట్టబెట్టేసింది. సదావర్తి సత్రానికి చెన్నై నగరానికి సమీపంలో ఉన్న 83 ఎకరాల అత్యంత విలువైన భూమిని ఏపీ ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే అప్పనంగా ఇచ్చేసింది. ప్రభుత్వ నిర్వాకంతో వందల కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడంతో డొంక కదిలింది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం లోతుగా విచారణ జరిపింది. సదావర్తి భూములకు తిరిగి వేలం నిర్వహించాలని ఆదేశించింది.

తెర వెనుక మంత్రాంగం
తాజా వేలంలోనూ టీడీపీ నేతలు చక్రం తిప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన బృందం చెన్నైలో మకాం వేసి మళ్లీ భూములు దక్కించుకునేందుకు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. భూములు తమ చేయి దాటిపోకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు కనబడుతోంది. తాజా వేలంలో రూ.60.30 కోట్లకు భూములు దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్‌ కంపెనీలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. వేలంలో పాల్గొన్న బద్వేలు శ్రీనివాస్‌ రెడ్డి.. వరదరాజులు రెడ్డి ముఖ్య అనుచరుడు. ఆస్తుల విలువను పూర్తిస్థాయిలో అధ్యయం చేసి మళ్లీ తనవాళ్లే భూములు దక్కించుకునేలా చంద్రబాబు వ్యవహారం నడిపినట్టు తాజా వేలం ద్వారా రుజువైంది.

జాతీయ స్థాయిలో మరింత ప్రచారం చేసివుంటే రూ.100 కోట్లపైగా ధర పలికేదని చెన్నై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అభిప్రాయపడ్డారు. సదావర్తి భూమి వేలానికి సంబంధించి జాతీయ పత్రికల్లో కూడా ప్రకటనలు ఇవ్వాలని హైకోర్టు తేల్చి చెప్పినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement