సాక్షి, హైదరాబాద్: అమరేశ్వరుడి భూములను కారుచౌకగా కొట్టేయాలని చూసి న్యాయస్థానాల సాక్షిగా అడ్డంగా దొరికిపోయి కూడా సీఎం చంద్రబాబు ఇంకా సిగ్గూ ఎగ్గూ లేకుండా తాను ఏ తçప్పు చేయలేదని బుకాయించే యత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సదావర్తి భూములను చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో భాగస్వాములైన కొంతమంది వ్యక్తులు, టీడీపీ నేతలు, మంత్రి లోకేశ్ బాబు ఆధ్వర్యంలో దోచుకోవాలని చూశారని దుయ్యబట్టారు. దీనిపై తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండోసారి వేలం వేస్తే రూ 60.30 కోట్లు ధర పలికిందన్నారు. చంద్రబాబు దోపిడీని వైఎస్సార్‌సీపీ సమర్థంగా అడ్డుకోవటంతో దిక్కుతోచని పరిస్థితిలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు శాఖాహారిగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రాజకీయ మాంసాహారిగా రాష్ట్ర ఆరోగ్యాన్ని భక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి పత్రికలో వార్త వస్తే.. జగన్‌పై విమర్శలా?
పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుపై ‘సాక్షి’లో కథనంపై చంద్రబాబు విమర్శలు చేయటంపై అంబటి అభ్యంతరం వ్యక్తం చేశారు. సదావర్తి పాపం నుంచి రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించేందుకే జగన్‌పై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఏపీపై కృష్ణా నదీ జలాల బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, ఆ ఫిర్యాదు లేఖను తెలంగాణ నీటి వనరుల శాఖ కార్యదర్శి మీడియాకు వివరించారని, దాని ఆధారంగా సాక్షితో సహా అన్ని తెలుగు, జాతీయ దిన పత్రికలు వార్తలు రాశాయని తెలిపారు. తెలంగాణ పత్రికలు తెలంగాణ ప్రభుత్వ వాదనను రాయడం తప్పా? అని ప్రశ్నించారు. అసలు కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ ఉంటే చంద్రబాబు ఎప్పుడైనా నోరు విప్పారా? అని సూటిగా ప్రశ్నించారు. శ్రీశైలం ఎగువ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులను సంకల్పిస్తే దానికి వ్యతిరేకంగా జగన్ దీక్ష చేశారని గుర్తు చేశారు. సాక్షి పత్రికలో ఒక వార్త వస్తే అది జగన్‌న్‌వాదన ఎలా అవుతుందని రాంబాబు ప్రశ్నించారు.
రాజకీయ మాంసాహారి
Published Sat, Sep 23 2017 2:02 PM | Last Updated on Fri, May 25 2018 7:29 PM
Advertisement