
సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి సత్రం భూముల వేలం పాటలో బిడ్డర్ చదలవాడ లక్ష్మణ్ చెల్లించిన డిపాజిట్‌ను తమ వద్దే ఉంచుకుంటామని, అందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సదావర్తి భూముల యాజమాన్య హక్కులు తమవేనంటూ తమిళనాడు ప్రభుత్వం గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు దీనిపై పూర్తి స్థాయిలో హైకోర్టు విచారణ జరపాలని చెబుతూ, భూముల వేలం ప్రక్రియలో పాల్గొన్న వారి డబ్బులు వెనక్కివ్వాలని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే.
అయితే యాజమాన్యం విషయం తేలే వరకు లక్ష్మణ్ డిపాజిట్‌ను తమ వద్ద ఉంచుకుంటామని ప్రభుత్వం తాజాగా పిటిషన్ వేసింది. మరోవైపు.. భూముల యాజమాన్య హక్కులు తేలేంత వరకు తన వేలం హక్కులను రద్దు చేయరాదని, విచారణలో భూములు ఏపీవని తేలితే తనకు కేటాయించాలని చదలవాడ లక్ష్మణ్ మరో పిటిషన్ వేశారు. వీరి వాదనలను తోసిపుచ్చుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లను తిరస్కరించింది. సత్రం భూములను కారు చౌకగా కట్టబెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేయడం వల్లే తిరిగి రెండవసారి వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. కేసు విచారణకు ఆళ్ల తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment