కురిచేడు: ప్రజల దాహార్తి తీర్చేందుకు నాగార్జున సాగర్ కాలువకు విడుదల చేసిన నీటిని మేజర్లు, ఎస్కేప్ చానళ్ల ద్వారా చేపల చెరువులకు మళ్లిస్తున్నారు. జిల్లాకు విడుదల చేసిన జలాలు మంగళవారం రాత్రి కురిచేడు చేరాయి. ఈ నీటితో మంచినీటి చెరువులు, రిజర్వాయర్లను నింపాల్సి ఉంది. అయితే ఆ నీటితో చేపల చెరువులు నింపేందుకు పక్కా ప్రణాళిక తయారు చేశారు. అందుకు ఎన్‌ఎస్‌పీ అధికారుల సహకారం కూడా ఉందనే విమర్శలున్నాయి. చేపల చెరువులున్న మేజర్లకు నీటిని విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది.
తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేసిన నీటిని మేజర్ కాలువలకు విడుదల చేయకూడదు. కానీ ప్రధాన కాలువ పరిధిలోని 115వ మైలులో ఉన్న పడమర కాశీపురం మేజరుకు నీటిని విడుదల చేశారు. 116, 117, 118 మైళ్లలో ఉన్న కల్లూరు మేజర్లకు స్వల్పంగా నీటిని విడుదల చేసి సీపేజి అని చెబుతున్నారు. ఆ నీరు కల్లూరు చేపల చెరువుకు చేరుతోంది.
119 వ మైలులోని నాంచారపురం మేజరును ఎత్తివేసి ఆవులమంద చేపల చెరువుకు నీటిని తరలిస్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని చేపల చెరువులు నింపేందుకు 124 వ మైలులోని ఐనవోలు మేజరును పూర్తి స్థాయిలో ఎత్తివేశారు.
దర్శి బ్రాంచి కాలువ పరిధిలోని పడమరవీరాయపాలెం మేజరుకు స్వల్పంగా నీటిని విడుదల చేశారు. పమిడిపాడు బ్రాంచి కాలువ పక్కనున్న ఎస్కేప్ చానల్ గుండా నీరు చేపల చెరువులకు చేరుతోంది. ఈ ఎస్కేప్‌ఛానల్ గోడను చేపల చెరువులకు నీరు వెళ్లేందుకు పడగొట్టారు. దీనిపై ఈనెల 11న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎస్‌ఈ కోటేశ్వరరావు అదేరోజు కాలువపై పర్యటించి పడిపోయిన గోడ నిర్మించాలని ఆదేశించారు. అయితే కిందిస్థాయి అధికారులు ఆ గోడ నిర్మిస్తూ రంధ్రాలు వదిలేయడంతో నీరు యథాప్రకారం బయటకు వచ్చి వాగుద్వారా చేపల చెరువుకు తరలిపోతోంది.
స్థానిక అట్లపల్లి రిజర్వాయర్ ఉన్నచోట సాగర్ కాలువకు తూము ఏర్పాటు చేస్తే..కాలువకు నీరు వచ్చిన సమయం లో ఎటువంటి వ్యయం లేకుండానే రిజ ర్వాయరు నింపుకోవచ్చు. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో తాగునీటి కోసం నీరు విడుదల చేసినప్పుడల్లా వేలకు వేలు వెచ్చించి నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చేపల చెరువులకు.. సాగర్ జలాలు
Published Thu, Aug 14 2014 4:00 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement