ఏపీజీబీ మేనేజర్ దుర్మరణం | sai prasad reddy dead in road acccident | Sakshi
Sakshi News home page

ఏపీజీబీ మేనేజర్ దుర్మరణం

Published Tue, Dec 9 2014 2:14 AM | Last Updated on Sat, Jun 2 2018 7:03 PM

ఏపీజీబీ మేనేజర్ దుర్మరణం - Sakshi

ఏపీజీబీ మేనేజర్ దుర్మరణం

మరి కొందరు బ్యాకర్లకు తీవ్ర గాయాలు

కదిరి : కదిరి-పులివెందుల రహదారిలో నామాలగుండు సమీపంలో సోమవారం లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కదిరి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆర్‌ఎం ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్న సాయిప్రసాద్‌రెడ్డి(55) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న ఆయన తోటి సీనియర్ మేనేజర్ రాఘవేంద్రప్రసాద్, ఇతని భార్య కదిరి మెయిన్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా ఉన్న వకులాదేవి, ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న నవనీశ్వర్, ఇతని సతీమణి పులివెందుల జేఎన్‌టీయూలో పనిచేస్తున్న శరణ్య, వీరి రెండేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం 108లో పులివెందులలో గంగిరెడ్డి ఆసుపత్రికి తరలించారు.

తలుపుల ఎస్‌ఐ గోపాలుడు కథనం ప్రకారం... మృతుడు సాయిప్రసాద్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా కడపలో టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న బాలాజీ పేటలో కాపురం ఉంటున్నారు. నిత్యం తన సొంత కారులో విధులకు హాజరయ్యేవారు. కదిరిలోనే కాపురం ఉంటూ కడపలో ఉంటున్న తమ తల్లిదండ్రులను చూడ్డానికి వెళ్లిన నవనీశ్వర్, రాఘవేంద్ర ప్రసాద్  కుటుంబసభ్యులు సైతం సాయిప్రసాద్ వెంట కారులో సోమవారం విధులకు హాజరయ్యేందు బయలుదేరారు.

నామాలగుండు సమీపంలోని మలుపు వద్ద కదిరి వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఆ కారును బలంగా ఢీ కొనడంతో కారు పూర్తిగా నుజ్జు జుజ్జు అయిపోయింది. కారు డ్రైవ్ చేస్తున్న సాయిప్రసాద్ గుండెలమీద బలంగా వత్తిడి పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన వారు దిక్కుకొకరు దూరంగా పడిపోయారు. సాయిప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు బాగా శ్రమించారు.

అనంతరం కదిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య స్వర్ణలత, కుమార్తె దివ్యసాయి ఉన్నారు. తీవ్రంగా గాయపడి పులివెందులలో చికిత్స పొందుతున్న వారికెవ్వరికీ ప్రాణాపాయం లేదని అక్కడి వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబసభ్యులను, గాయపడిన వారిని ఏపీజీబీ ఆర్‌ఎం ప్రతాప్‌రెడ్డి, మిగిలిన ఆ బ్యాంకు ఉద్యోగులు పరామర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement