ప్రభుత్వంపై ఇసుక లారీ ఓనర్ల మండిపాటు
ఎవరి నిర్ణయమిది.. ఎందుకు చేయాలి?
మైనింగ్ శాఖతో ఒప్పందం చేసుకోవాలా?
లారీ కిరాయిపై జీఎస్టీ ఎలా విధిస్తారు?
రవాణాలో జాప్యం జరిగితే జరిమానా విధిస్తారా?
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : లక్షలాది రూపాయలు అప్పులు చేసి, లారీ కొనుక్కొని కిరాయికి తిప్పుకుంటున్న తమను ప్రభుత్వం వేధిస్తోందని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సరఫరాకు తాము ప్రభుత్వానికి ముందస్తుగా ఎందుకు డిపాజిట్ చెల్లించాలని, ఇది ఎవరి నిర్ణయమని నిలదీశారు. పైగా రూ.50 బాండ్ పేపర్‌పై మైనింగ్ శాఖతో అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) చేసుకుని, లారీని కిరాయికి తిప్పుకోవాలా? అని ప్రశ్నించారు.
విజయవాడ విద్యాధరపురంలోని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీపై ధ్వజమెత్తుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇసుక రీచ్‌కు లోడు కోసం వెళితే ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. కొన్ని ఊళ్లల్లో స్థానిక కూటమి నాయకులు లోకల్ అంటూ రోజుకు మూడు ట్రిప్పులు తోలుకుంటుంటే తాము అలా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్లమూడి వెంకటేశ్వరరావు (విజయవాడ అర్బన్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్), అన్నే చిట్టిబాబు (ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు) సూరెడ్డి సాంబిరెడ్డి (పైపుల రోడ్ శాండ్ లారీ ఓనర్ల అసోసియేషన్), చుక్కాపు రమేష్, రత్తయ్య, తన్నీరు పాపారావు (డిస్ట్రిక్ట్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు) తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
» కిరాయికి ఇసుక తోలే ట్రాక్టర్‌కు రూ.1500, 6 టైర్ల లారీకి రూ.3 వేలు, 10 టైర్ల లారీకి రూ.6 వేలు, 12–14 టైర్ల లారీకి రూ.10 వేలు డిపాజిట్ చేయాలనడం దుర్మార్గమైన చర్య కాదా?
» ఇసుక రవాణా చార్జిల విషయంలో రవాణా శాఖ, కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారులు లారీ యజమానులతో చర్చించకుండా వారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం లారీ ఓనర్లను మోసం చేయడం కాదా?
» లారీ కిరాయి ధరపై జీఎస్‌టీ విధింపు ఎంత వరకు సమంజసం?
» బుక్ చేసుకున్న వారికి లోడును చేరవేయడంలో జాప్యం (ట్రాఫిక్ రద్దీ లేదా లారీ రిపేర్) జరిగితే జరిమానా విధిస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయం?
» ఇంతకూ ఇసుక కిరాయి ఎవరు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారు.. ఎక్కడ ఇస్తారు?
» వేలకు వేలు ట్యాక్స్‌లు, డ్రైవర్ జీతభత్యాలు కట్టుకుంటూ ప్రభుత్వ ఆంక్షలు పాటించే కంటే మా లారీలను సర్కారుకే అప్పగిస్తాం.. అలా చేస్తే నెలకు ఎంత ఇస్తారు?
ఇసుక ఫ్రీ అని చెప్పి బ్లాక్‌లో అమ్ముకుంటారా?
డాబాగార్డెన్స్: ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి ధరలు మరింత పెంచి బ్లాక్‌లో అమ్ముతూ.. భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొడుతున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కార్మికులను తీవ్రంగా మోసం చేశారని భవన నిర్మాణ కార్మికులు ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకపోతే వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక రోడ్డున పడ్డామంటూ సిటూ ఆధ్వర్యంలో మంగళవారం గొల్లలపాలెం సింగ్ హోటల్ జంక్షన్ వద్ద నిరసనకు దిగారు.
కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం.సుబ్బారావు, కె.నర్సింగరావు, చంద్రమౌళి, సిమ్మినాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ గాల్లోకి వదిలేసిందన్నారు. ఇసుక లభించకపోవడంతో వేలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇంతగా రోడ్డున పడినా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment