మూగజీవాలపై మృత్యుబీభత్సానికి ‘సాక్షి’ (అంతరచిత్రం) పేపకాయల సతీష్‌కుమార్
కాకినాడ: ఆ మూగజీవాల్లో కొన్ని అప్పటికే విగతజీవులై కళేబరాలుగా మారాయి. మిగిలినవి తినడానికి ఓ పచ్చిక పరకయినా లేక ఈ క్షణమో, మరుక్షణమో ప్రాణం గాలిలో కలిసేలా ఉన్నాయి. మృత్యువు మూగజీవాలతో బఫే విందు చేసుకుంటున్నట్టున్న ఆ హృదయవిదారక దృశ్యాన్ని కెమెరాలో బంధించి కళ్లకు కట్టించారు.. ‘సాక్షి’ కాకినాడ ఫొటోగ్రాఫర్ పేపకాయల సతీష్‌కుమార్. చూసిన వారి గుండెలు జాలితో నిండేలా ఉన్న ఆ ఫొటోకు ఇండియన్ ప్రెస్‌ఫొటో అవార్డు దక్కింది. విజయవాడకు చెందిన స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్–2(స్పాప్–2) సంస్థ దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసి అవార్డులు ఇస్తోంది.
ఇటీవల జిల్లా కేంద్రం కాకినాడలో జంతు హింసా నివారణ సంఘ ఆవరణలో పెద్ద సంఖ్యలో పశువులు మృతి చెందిన ఘటనకు సంబంధించిన సతీష్ తీసిన ఫొటోకు కన్సొలేషన్ బహుమతికి ఎంపికైంది. ‘హిందుస్థాన్ టైమ్స్’ నేషనల్ ఫొటో ఎడిటర్ టి.నారాయణ్, ‘సాక్షి’ ఫొటో ఎడిటర్ రవికాంత్‌రెడ్డి, ‘ది హిందు’ స్పెషల్ న్యూస్ ఫొటోగ్రాఫర్ విజయభాస్కరరావు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. వచ్చేనెల మొదటివారంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశ వ్యాప్త పోటీలో బహుమతి పొందిన సతీష్‌ను పలువురు ఫొటోగ్రాఫర్లు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment