మేయర్ భరోసా | sakshi vip reporter as a meyor shaik noorjahan | Sakshi
Sakshi News home page

మేయర్ భరోసా

Published Thu, Nov 13 2014 3:47 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

మేయర్ భరోసా - Sakshi

మేయర్ భరోసా

* చిట్టివలసపాకలులో పర్యటించిన నూర్జహాన్
* పింఛన్లు, డ్రెయినేజీ, ఇళ్ల సమస్యల్ని విన్నవించిన ప్రజలు
* పరిష్కరిస్తానని మేయర్ హామీ

 
 VIP రిపోర్టర్
 షేక్ నూర్జహాన్, మేయర్
 
ఏలూరు నగర నడిబొడ్డున అది ఓ చిన్నపాటి బస్తీ. పేరు చిట్టివలసపాకలు. సిక్కోలు నుంచి బడుగు, బలహీన వర్గాల వారు ఎన్నో ఏళ్ల కిందట పొట్టచేత పట్టుకుని ఇక్కడకు వచ్చారు. అక్కడ గుడిసెలు, చిన్నపాటి ఇళ్లు కట్టుకుని నివశిస్తున్నారు. వారంతా దశాబ్దాల తరబడి కనీస వసతుల కోసం.. ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరి సమస్యలు తెలుసుకునేందుకు ఏలూరు తొలి మహిళా మేయర్ షేక్ నూర్జహాన్ ‘సాక్షి రిపోర్టర్’గా మారారు.

బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆ ప్రాంతంలోని ఇంటింటికీ వెళ్లారు. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. కొన్ని సమస్యలు విని చలించిపోయారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ‘అమ్మా.. నమస్తే. నేను ఏలూరు నగర మేయర్ నూర్జహాన్. మీ డివిజన్‌లో సమస్యలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను.


మీ కాలనీలో సమస్యలు, మీరు పడుతున్న ఇబ్బందులేమిటో చెప్పండి?
కరణం తవిటమ్మ : ఇక్కడ మురుగుకాలువ సమస్య ఎక్కువగా ఉందమ్మా. దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించండి.
నూర్జహాన్ : ఈ సమస్యలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. మీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి మురుగు కాలువల్లో పూడికలు తీయిస్తాం.
నూర్జహాన్ : అమ్మా.. నీ పేరేంటి. నీ సమస్య ఏమిటి.
 
మీ కార్పొరేటర్ అందుబాటులో ఉంటున్నారా ?
జి.గవరమ్మ : మా కొర్పొరేటర్ అందుబాటులోనే ఉంటున్నారు. రోడ్లు బాగానే శుభ్రం చేస్తున్నారు. పిలవగానే వస్తున్నారు.మరికొంత ముందుకు వెళ్లిన మేయర్ అక్కడ గుమిగూడిన మహిళలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను ఆరా తీశారు.
 
నూర్జహాన్ : అమ్మా.. మీకున్న ఇబ్బందులేమిటి ?
బి.గంగమ్మ : మేయరమ్మా.. ఈ ప్రాంతంలో ఆడపిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. గతంలో వారందరికీ పింఛన్లు వచ్చేవి. రెండు నెలల నుంచి పింఛన్లు నిలిచిపోయాయి. వాటిని ఎలాగైనా మీరే ఇప్పించాలమ్మా.
నూర్జహాన్ : పింఛన్లు ఎవరికీ ఆపటం లేదు. సాంకేతిక కారణాలతోనే కొంతమందికి పింఛను సొమ్ము ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది. అందరికీ పింఛన్లు ఇచ్చేలా చూస్తా. అక్కడి నుంచి ముందుకు కదిలిన మేయర్ సింగ్ వీధిలో అడుగుపెట్టారు.
 పి.సత్యవతి : అమ్మా.. గతంలో నాకు పింఛను వచ్చేది. ఇప్పుడు ఇవ్వటం లేదు.
 
నూర్జహాన్ : మీకు ఆధార్‌కార్డు ఉందా. పింఛను కోసం దరఖాస్తు చేశారా?
 సత్యవతి : ఆధార్ కార్డు ఉందమ్మా. దరఖాస్తు చేశాను. అయినా డబ్బు ఇవ్వటం లేదు.
 నూర్జహాన్ : మీ సమస్య పరిష్కరిస్తా..
 
మీ పేరేంటమ్మా. మీకు పింఛను వస్తోందా?
 జి.కొండమ్మ : వస్తోందమ్మా. నెలకు రూ.1,500 ఇస్తున్నారు.
 
నూర్జహాన్ : వీధిలైట్లు వెలుగుతున్నాయా?
 ఎ.సంజీవ్ : అన్నిచోట్లా వెలుగుతున్నాయ్ మేడమ్.
 
మేయర్ : ఇంకా ఏవైనా సమస్యలున్నాయా?
వి.అప్పాయమ్మ : దోమలు ఎక్కువగా ఉంటున్నాయమ్మా.
సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మేయర్ నూర్జహాన్ అక్కడ నుంచి సోమంచి వారి వీధికి వెళ్లారు. అక్కడి ప్రజలను ఉద్దేశించి మీ అందరికీ ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఉన్నాయా అని అడిగారు.
 కె.నాగమణి : మా ప్రాంతంలో కొంతమందికే ఇళ్లు ఉన్నాయమ్మా. చాలామందికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవు.
 డి.ఎల్లాయమ్మ : ఈ వీధిలో డ్రెయినేజీ సమస్య ఉంది. మురుగు నీరు పారటం లేదు.
 ఎస్.సత్యవతి : నాకు పింఛను రావటం లేదమ్మా.
 పి.జయలక్ష్మి : నాకు గ్యాస్ డబ్బులు, పింఛను రావటం లేదు. వేలిముద్రలు పడకపోతే గ్యాస్ డబ్బులు రావని చెబుతున్నారు.
 జి.కొండమ్మ : నాకు ఉండటానికి ఇల్లు కావాలమ్మా.
 కె.నాగమణి : నాకు గ్యాస్ కనెక్షన్ ఉంది. రెండో బండ ఇప్పించాలమ్మా.
 బి.సత్యవతి : మా ఆయనకు పింఛను రావటం లేదు.
 
నూర్జహాన్ : మీ భర్త వయసెంత. 65 సంవత్సరాలు నిండాయా?
సత్యవతి : ఆయనకు 70 ఏళ్లమ్మా. ఏలాగైనా పింఛను ఇప్పించండి.అక్కడి నుంచి దక్షిణం వైపు వెళ్లిన నూర్జహాన్ ఆ ప్రాంత ప్రజల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ‘మీ కార్పొరేటర్ మీ సమస్యలు వింటున్నారా’ అని ఆరా తీశారు. అక్కడి వారు చెప్పిన సమస్యలు ఇలా ఉన్నారుు.
గుర్రం సత్యవతి : మా ఆయనకు మాటలు రావు. వికలాంగుడు. అయినా పింఛను రావటం లేదు.
జి.పార్వతి : గతంలో నాకు రూ.200 పింఛను వచ్చేది. ఇప్పుడు తీసేశారు.
డి.ఎల్లాయమ్మ : ఇక్కడ మంచి స్కూల్ లేకపోవటంతో పిల్లలు ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో చదువుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ద్వారా ఇంగ్లిష్ మీడియం స్కూలు పెట్టేలా చూడండి.
 
నూర్జహాన్ : మన నగరపాలక సంస్థ స్కూళ్లను అభివృద్ధి చేస్తాం. వాటిలో పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇంగ్లిష్ మీడియం కూడా పెట్టి మంచి విద్య అందించేందుకు కృషి చేస్తాం.
ఇంతలో అక్కడ ఓ చిన్నారి కనపడగా.. ‘ఏమ్మా నీ పేరేంటి. స్కూల్‌కు వెళుతున్నావా. మధ్యాహ్న భోజనం పెడుతున్నారా’ అని నూర్జహాన్ అడిగారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లిన మేయర్ ఆ ప్రాంత ప్రజలనుద్ధేశించి.. ‘నేనెవరో తెలుసా’ అని అడిగారు. అక్కడి మహిళలు ‘తెలుసమ్మా.. మీరు మా మేయరేగా’ అంటూ చిరునవ్వులు చిందించారు.

నూర్జహాన్ : ఏమ్మా.. ఏంటి విషయాలు. మేం బాగా పని చేస్తున్నామా?
జగ్గంపూడి పండు : అంతా బాగానే ఉందమ్మా. అయితే, కొంతమందికి పెన్షన్లు తీసివేయడమే పెద్ద సమస్యగా ఉంది.
టి.నాగేశ్వరరావు : ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా లేదు. మీరు కొంచెం పరిశీలించండి.
టి.సూర్యాకాంతం : రోడ్లు బాగు చేయించండి మేయరమ్మా. చెత్తాచెదారంతో ఉంటున్నాయి.
నూర్జహాన్ : మీరు చెప్పిన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాను. పారిశుధ్య విభాగం అధికారులకు చెప్పి రోడ్లు శుభ్రంగా ఉండేలా చూస్తా.

పాల్గొన్న వారు
మేయర్ నూర్జహాన్ వెంట 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం లోకేష్, నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, నగరపాలక సంస్థ విప్ శ్రీనివాస్ ఉన్నారు.
 
చలించి.. స్పందించి.. హామీలిచ్చిన మేయర్ నూర్జహాన్

ఏలూరు నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. చిట్టివలసపాకలు ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను. ప్రధానంగా ప్రస్తావించిన పింఛన్లు, డ్రెయినేజీ సమస్య, దోమలు, పారిశుధ్యం వంటి నా పరిధిలోని సమస్యలను అధికారులతో చెప్పి పరిష్కరిస్తాను. గ్యాస్ కనెక్షన్లు, రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు వంటివి ఎమ్మెల్యే బడేటి బుజ్జి దృష్టికి తీసుకువెళ్లి ఆయనతో చర్చించి.. ప్రభుత్వం నుంచి అర్హులైన అందరికీ పధకాలు అందేలా చర్యలు తీసుకుంటాను.

ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేదలకు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటంతోపాటు ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించటంలో ముందుండేలా వారికి తగిన సలహాలు, సూచనలు చేస్తాను. ప్రజలు మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకు సాధ్యమైనంత సేవ చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా.
 
‘సాక్షి’కి థ్యాంక్స్
ఈ ప్రాంతంలో సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారికి భరోసా కల్పించేందుకు ‘సాక్షి’ నిర్వహించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం అద్భుతంగా ఉంది. 33వ డివిజన్ చిట్టివలసపాకలు ప్రాంతంలో ప్రజలు ప్రధానంగా ఇళ్లస్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సందర్భంలో నిర్వహించిన పాదయాత్రలోనూ ఇక్కడి ప్రజలు మాకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు కావాలంటూ వినతులు సమర్పించారు. మేం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగానే ఈ ప్రాంతంలో ఇళ్లులేని పేదలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం.
 - చోడే వెంకటరత్నం, డెప్యూటీ మేయర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement