Division problems
-
7 మండలాల విలీన వివాదంపై చలసాని కీలక వ్యాఖ్యలు
సాక్షి విజయవాడ: ఏడు మండలాల విలీన వివాదంపై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారన్నది అవాస్తవం..చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని.. రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోనే ఉంది. విభజన ఆస్తులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని చలసాని డిమాండ్ చేశారు.ఎన్డీయే ప్రభుత్వం ఏపీపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆస్తులను తెలంగాణకు అప్పగించారు. విభజన హామీల అమలు కోసం నాటి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై దుర్మార్గంగా వ్యవహరించింది. తెలుగు రాష్ట్రాల మద్య సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీం కోర్టు న్యాయమూర్తితో కమిటీ వేయాలంటే ఎందుకు కేంద్రం ఒప్పుకోవడం లేదు. రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి.’’ అంటూ చలసాని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు లేఖ.. రేవంత్ రిప్లై..
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 6న భేటీకి సిద్ధమని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజాభవన్‌లో భేటీకి రావాలని లేఖలో రేవంత్ ఆహ్వానించారు. విభజన సమస్యల పరిష్కారం కోరుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు.కాగా, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కలిసి చర్చించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరముందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, రెండు రాష్ట్రాల లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాల్సి వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయని చంద్రబాబు ఈ సందర్భంగా ఆ లేఖలో గుర్తుచేశారు. -
విభజనపై సందిగ్ధం..!
కరీంనగర్: జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు ముగిశాయి. కొత్త పాలకవర్గం ఎన్నిక పూర్తయ్యింది. మరో 20 రోజుల్లో కొలువుదీరడమే మిగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు నాలుగు జిల్లాల్లోనూ పల్లె ఓటర్లను తమవైపు తిప్పుకొని పాలకవర్గాలను ‘కారు’ ఎక్కించిన విషయం విదితమే. నాలుగు జిల్లాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలుపొందడం, చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకపక్షంగా జరిగి నాలుగు జిల్లా పరిషత్‌లను తమ ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. గత మూడు నెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక వర్గాల ఎంపిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలు అయ్యారు. ఇక కొత్తపాలక వర్గాలు కొలువుదీరేందుకు అవసరమైన జిల్లా పరిషత్ కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగుల పదోన్నతులు చేపడుతారా.. లేదా వర్క్ టు సర్వ్ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు విభజిస్తారా అనేది తేలాల్సి ఉంది. జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదు. నాలుగు జిల్లాలకు నోడల్ జెడ్పీగా ఉన్న కరీంనగర్ జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా, మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి సిబ్బంది నివేదించారు. కరీంనగర్ జెడ్పీలో 80 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఈ సిబ్బందినే నాలుగు జిల్లాలకు విభజించే ఆస్కారం ఉంది. ఇటీవల వెలువడిన ఆదేశాల ప్రకారం జెడ్పీలోని కొన్ని విభాగాలను కుదించే అవకాశం కూడా లేకపోలేదు. మరికొన్ని పోస్టులను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక్కో జిల్లా పరిషత్‌కు 19 మంది సిబ్బంది అవసరం, సీఈవో, డిప్యూటీ సీఈవో, రెండు సూపరింటెండెంట్ పోస్టులు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్క జెడ్పీలో ఎంత తక్కువ అన్న కనీసం 19 మంది ఉంటేనే పాలన సవ్యంగా కొనసాగించే వీలుంటుంది. ప్రస్తుతం జెడ్పీ పరిధిలో 80 మంది ఉద్యోగులను విభజించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల జెడ్పీలకు లైజన్ అధికారులతోపాటు ఒక్కొక్క జిల్లాకు ఆరుగురి వరకు సిబ్బందిని ఎన్నికల విధుల నిమిత్తం రిలీవ్ చేశారు. ఎన్నికల అనంతరం ఆయా సిబ్బంది మళ్లీ జెడ్పీలో నివేదించారు. కొత్త జిల్లాల్లో సిబ్బందిని పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారా లేదా సర్వ్ టు రూల్ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే ఈ సిబ్బందిని కేటాయిస్తారా అన్న దానిపై జిల్లా పరిషత్ ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్స్ మిషన్లు, తదితర సామగ్రి సమాచారం సైతం పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఇప్పటికే చేరింది. కొత్త మండల పరిషత్‌లకు కనీసం పది మంది... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మండలానికి కనీసం పది మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను విభజించి ఒక్కొక్క మండల పరిషత్‌కు మిగతా మండలాల నుంచి పది మంది ఉద్యోగులను నియమిస్తే పాలనసాఫీగా సాగుతుంది. ఒక్క మండలంలో ఓ ఎంపీడీవో, సూపరిండెంటెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు అవసరం. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. జూలై 5న కొత్తపాలక వర్గాలు... ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి జిల్లా పరిషత్, చైర్పర్సన్లు, వైస్చైర్మన్లతో పాలక వర్గాలు ఏర్పడ్డాయి. వచ్చే జులై 5న కొత్త పాలక వర్గాలు ఆయా జిల్లాల్లో కొలువుదీరాల్సి ఉంది. కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా.. లేదా అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఎంపీడీవో కార్యాలయాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన భవనాల్లో ఎన్నికల తతంగం ముగించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల సామగ్రి, సిబ్బంది పంపిణీ అంతా పూర్తిస్థాయిలో కరీంనగర్ జిల్లా పరిషత్ నుంచే కొనసాగింది. తక్షణం ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఆదేశాలు అందాకే కార్యాచరణ... కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయాలు, ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. గతంలో అడిగిన పూర్తి సమాచారం నివేదించాం. జిల్లా పరిషత్ కొత్త పాలక వర్గంలు ఎన్నిక నియమాకం ముగిసింది. పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి మార్గదర్శకాలు రాగానే వాటికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టి పనులు మొదలు పెడుతాం. – జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు -
మేయర్ భరోసా
* చిట్టివలసపాకలులో పర్యటించిన నూర్జహాన్ * పింఛన్లు, డ్రెయినేజీ, ఇళ్ల సమస్యల్ని విన్నవించిన ప్రజలు * పరిష్కరిస్తానని మేయర్ హామీ VIP రిపోర్టర్ షేక్ నూర్జహాన్, మేయర్ ఏలూరు నగర నడిబొడ్డున అది ఓ చిన్నపాటి బస్తీ. పేరు చిట్టివలసపాకలు. సిక్కోలు నుంచి బడుగు, బలహీన వర్గాల వారు ఎన్నో ఏళ్ల కిందట పొట్టచేత పట్టుకుని ఇక్కడకు వచ్చారు. అక్కడ గుడిసెలు, చిన్నపాటి ఇళ్లు కట్టుకుని నివశిస్తున్నారు. వారంతా దశాబ్దాల తరబడి కనీస వసతుల కోసం.. ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరి సమస్యలు తెలుసుకునేందుకు ఏలూరు తొలి మహిళా మేయర్ షేక్ నూర్జహాన్ ‘సాక్షి రిపోర్టర్’గా మారారు. బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆ ప్రాంతంలోని ఇంటింటికీ వెళ్లారు. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. కొన్ని సమస్యలు విని చలించిపోయారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ‘అమ్మా.. నమస్తే. నేను ఏలూరు నగర మేయర్ నూర్జహాన్. మీ డివిజన్లో సమస్యలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. మీ కాలనీలో సమస్యలు, మీరు పడుతున్న ఇబ్బందులేమిటో చెప్పండి? కరణం తవిటమ్మ : ఇక్కడ మురుగుకాలువ సమస్య ఎక్కువగా ఉందమ్మా. దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించండి. నూర్జహాన్ : ఈ సమస్యలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. మీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి మురుగు కాలువల్లో పూడికలు తీయిస్తాం. నూర్జహాన్ : అమ్మా.. నీ పేరేంటి. నీ సమస్య ఏమిటి. మీ కార్పొరేటర్ అందుబాటులో ఉంటున్నారా ? జి.గవరమ్మ : మా కొర్పొరేటర్ అందుబాటులోనే ఉంటున్నారు. రోడ్లు బాగానే శుభ్రం చేస్తున్నారు. పిలవగానే వస్తున్నారు.మరికొంత ముందుకు వెళ్లిన మేయర్ అక్కడ గుమిగూడిన మహిళలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను ఆరా తీశారు. నూర్జహాన్ : అమ్మా.. మీకున్న ఇబ్బందులేమిటి ? బి.గంగమ్మ : మేయరమ్మా.. ఈ ప్రాంతంలో ఆడపిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. గతంలో వారందరికీ పింఛన్లు వచ్చేవి. రెండు నెలల నుంచి పింఛన్లు నిలిచిపోయాయి. వాటిని ఎలాగైనా మీరే ఇప్పించాలమ్మా. నూర్జహాన్ : పింఛన్లు ఎవరికీ ఆపటం లేదు. సాంకేతిక కారణాలతోనే కొంతమందికి పింఛను సొమ్ము ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది. అందరికీ పింఛన్లు ఇచ్చేలా చూస్తా. అక్కడి నుంచి ముందుకు కదిలిన మేయర్ సింగ్ వీధిలో అడుగుపెట్టారు. పి.సత్యవతి : అమ్మా.. గతంలో నాకు పింఛను వచ్చేది. ఇప్పుడు ఇవ్వటం లేదు. నూర్జహాన్ : మీకు ఆధార్‌కార్డు ఉందా. పింఛను కోసం దరఖాస్తు చేశారా? సత్యవతి : ఆధార్ కార్డు ఉందమ్మా. దరఖాస్తు చేశాను. అయినా డబ్బు ఇవ్వటం లేదు. నూర్జహాన్ : మీ సమస్య పరిష్కరిస్తా.. మీ పేరేంటమ్మా. మీకు పింఛను వస్తోందా? జి.కొండమ్మ : వస్తోందమ్మా. నెలకు రూ.1,500 ఇస్తున్నారు. నూర్జహాన్ : వీధిలైట్లు వెలుగుతున్నాయా? ఎ.సంజీవ్ : అన్నిచోట్లా వెలుగుతున్నాయ్ మేడమ్. మేయర్ : ఇంకా ఏవైనా సమస్యలున్నాయా? వి.అప్పాయమ్మ : దోమలు ఎక్కువగా ఉంటున్నాయమ్మా. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మేయర్ నూర్జహాన్ అక్కడ నుంచి సోమంచి వారి వీధికి వెళ్లారు. అక్కడి ప్రజలను ఉద్దేశించి మీ అందరికీ ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఉన్నాయా అని అడిగారు. కె.నాగమణి : మా ప్రాంతంలో కొంతమందికే ఇళ్లు ఉన్నాయమ్మా. చాలామందికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవు. డి.ఎల్లాయమ్మ : ఈ వీధిలో డ్రెయినేజీ సమస్య ఉంది. మురుగు నీరు పారటం లేదు. ఎస్.సత్యవతి : నాకు పింఛను రావటం లేదమ్మా. పి.జయలక్ష్మి : నాకు గ్యాస్ డబ్బులు, పింఛను రావటం లేదు. వేలిముద్రలు పడకపోతే గ్యాస్ డబ్బులు రావని చెబుతున్నారు. జి.కొండమ్మ : నాకు ఉండటానికి ఇల్లు కావాలమ్మా. కె.నాగమణి : నాకు గ్యాస్ కనెక్షన్ ఉంది. రెండో బండ ఇప్పించాలమ్మా. బి.సత్యవతి : మా ఆయనకు పింఛను రావటం లేదు. నూర్జహాన్ : మీ భర్త వయసెంత. 65 సంవత్సరాలు నిండాయా? సత్యవతి : ఆయనకు 70 ఏళ్లమ్మా. ఏలాగైనా పింఛను ఇప్పించండి.అక్కడి నుంచి దక్షిణం వైపు వెళ్లిన నూర్జహాన్ ఆ ప్రాంత ప్రజల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ‘మీ కార్పొరేటర్ మీ సమస్యలు వింటున్నారా’ అని ఆరా తీశారు. అక్కడి వారు చెప్పిన సమస్యలు ఇలా ఉన్నారుు. గుర్రం సత్యవతి : మా ఆయనకు మాటలు రావు. వికలాంగుడు. అయినా పింఛను రావటం లేదు. జి.పార్వతి : గతంలో నాకు రూ.200 పింఛను వచ్చేది. ఇప్పుడు తీసేశారు. డి.ఎల్లాయమ్మ : ఇక్కడ మంచి స్కూల్ లేకపోవటంతో పిల్లలు ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో చదువుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ద్వారా ఇంగ్లిష్ మీడియం స్కూలు పెట్టేలా చూడండి. నూర్జహాన్ : మన నగరపాలక సంస్థ స్కూళ్లను అభివృద్ధి చేస్తాం. వాటిలో పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇంగ్లిష్ మీడియం కూడా పెట్టి మంచి విద్య అందించేందుకు కృషి చేస్తాం. ఇంతలో అక్కడ ఓ చిన్నారి కనపడగా.. ‘ఏమ్మా నీ పేరేంటి. స్కూల్‌కు వెళుతున్నావా. మధ్యాహ్న భోజనం పెడుతున్నారా’ అని నూర్జహాన్ అడిగారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లిన మేయర్ ఆ ప్రాంత ప్రజలనుద్ధేశించి.. ‘నేనెవరో తెలుసా’ అని అడిగారు. అక్కడి మహిళలు ‘తెలుసమ్మా.. మీరు మా మేయరేగా’ అంటూ చిరునవ్వులు చిందించారు. నూర్జహాన్ : ఏమ్మా.. ఏంటి విషయాలు. మేం బాగా పని చేస్తున్నామా? జగ్గంపూడి పండు : అంతా బాగానే ఉందమ్మా. అయితే, కొంతమందికి పెన్షన్లు తీసివేయడమే పెద్ద సమస్యగా ఉంది. టి.నాగేశ్వరరావు : ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా లేదు. మీరు కొంచెం పరిశీలించండి. టి.సూర్యాకాంతం : రోడ్లు బాగు చేయించండి మేయరమ్మా. చెత్తాచెదారంతో ఉంటున్నాయి. నూర్జహాన్ : మీరు చెప్పిన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాను. పారిశుధ్య విభాగం అధికారులకు చెప్పి రోడ్లు శుభ్రంగా ఉండేలా చూస్తా. పాల్గొన్న వారు మేయర్ నూర్జహాన్ వెంట 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం లోకేష్, నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగరపాలక సంస్థ విప్ శ్రీనివాస్ ఉన్నారు. చలించి.. స్పందించి.. హామీలిచ్చిన మేయర్ నూర్జహాన్ ఏలూరు నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. చిట్టివలసపాకలు ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను. ప్రధానంగా ప్రస్తావించిన పింఛన్లు, డ్రెయినేజీ సమస్య, దోమలు, పారిశుధ్యం వంటి నా పరిధిలోని సమస్యలను అధికారులతో చెప్పి పరిష్కరిస్తాను. గ్యాస్ కనెక్షన్లు, రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు వంటివి ఎమ్మెల్యే బడేటి బుజ్జి దృష్టికి తీసుకువెళ్లి ఆయనతో చర్చించి.. ప్రభుత్వం నుంచి అర్హులైన అందరికీ పధకాలు అందేలా చర్యలు తీసుకుంటాను. ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేదలకు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటంతోపాటు ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించటంలో ముందుండేలా వారికి తగిన సలహాలు, సూచనలు చేస్తాను. ప్రజలు మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకు సాధ్యమైనంత సేవ చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ‘సాక్షి’కి థ్యాంక్స్ ఈ ప్రాంతంలో సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారికి భరోసా కల్పించేందుకు ‘సాక్షి’ నిర్వహించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం అద్భుతంగా ఉంది. 33వ డివిజన్ చిట్టివలసపాకలు ప్రాంతంలో ప్రజలు ప్రధానంగా ఇళ్లస్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సందర్భంలో నిర్వహించిన పాదయాత్రలోనూ ఇక్కడి ప్రజలు మాకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు కావాలంటూ వినతులు సమర్పించారు. మేం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగానే ఈ ప్రాంతంలో ఇళ్లులేని పేదలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం. - చోడే వెంకటరత్నం, డెప్యూటీ మేయర్