
సమైఖ్యశంఖారావం జరిగి తీరుతుంది: భూమన
తిరుపతి: రాష్ట్ర రాజధానిలో హైదరాబాదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న జరప తలపెట్టిన సమైఖ్యశంఖారావం సభ జరిగి తీరుతుందని తిరుపతి ఎమ్మెల్యె భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా న్యాయస్థానాల మీద తమ పార్టీకి అపారగౌరవం ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ ఏజెంట్ లా పని చేస్తూ రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు అయ్యారని ఆరోపించారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన దీక్షలకు కరుణాకర్ రెడ్డి నేడు సంఘీబావం ప్రకటించారు. హైదరాబాదులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమైఖ్యశంఖారావం సభ నబూతో న భవిష్యత్ తరహాలో జరుగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'సమైఖ్య శంఖారావం'... సమైక్యాంధ్ర ఉద్యమంలో మైలురాయిగా నిలుస్తుందని భూమన అన్నారు.