తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో రెండు వసతి సముదాయాలను నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం జీఎస్టీ కాకుండా రూ.419.30 కోట్లతో టెండర్లను టీటీడీ పాలకమండలి ఆమోదించినట్లు తెలిపారు. తిరుమలలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి సత్రం (రెండోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం (మూడోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లను ఆమోదించినట్లు వివరించారు. రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు పాలకమండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలు..
♦ టీటీడీ ఉద్యోగులకు సంబంధించి మొదటిదఫా డిసెంబరు 28న 3,518 మందికి, రెండోదఫా జనవరి మొదటి వారంలో 1,500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ.
♦ మూడోదఫా ఫిబ్రవరిలో 5 వేల మందికి లబ్ధి చేకూరేలా ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి సేకరణకు కలెక్టర్‌కు ప్రతిపాదన.
♦ ఇళ్లస్థలాలను ప్రభుత్వం నుంచి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. æ శ్రీవారి పోటు కార్మికులకు వేతనం మరో రూ.10 వేలు పెంపు
♦ వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి తగిన వేతనం పెంపు.
♦ టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంపు.
♦ ఇప్పటికే స్కిల్డ్ కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.18,500 , సెమీస్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు, అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.10,340 నుంచి రూ.15 వేలకు పెంపు.
♦ కల్యాణకట్టలో విధులు నిర్వర్తిస్తున్న పీస్‌రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేల కనీస వేతనం.
♦ ఫిబ్రవరిలో తిరుమలలో పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సు
♦ వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయ అర్చక కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న పెద్దజీయర్ మఠానికి రూ.60 లక్షలు, చిన్నజీయర్ మఠానికి రూ.40 లక్షల ఆర్థిక సహకారం పెంపు.
భగవద్గీత, గోవింద కోటి పుస్తకాల ఆవిష్కరణ
శ్రీ భగవద్గీత, స్థానిక ఆలయాల క్యాలెండర్లు, గోవింద కోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సనాతన ధర్మం పట్ల, మానవీయ, నైతిక విలువల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా 20 పేజీలతో కూడిన భగవద్గీత లక్ష పుస్తకాలను టీటీడీ ముద్రించింది. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment