62వ రోజూ కొనసాగుతున్న సమైక్య పోరు
చిత్తూరు/కర్నూలు/అనంతపురం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం 62కు చేరుకుంది. రాష్ట్రాన్ని విడగొట్టొదంటూ సమైక్య ఉద్యమకారులు గత రెండు నెలలుగా నిర్విరామంగా పోరాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలు సైతం ఉద్యమంలో పాల్గొంటున్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. 2వ రోజు కొనసాగుతున్న ఆటోల బంద్ జరుగుతోంది. చిత్తూరులో నగర పాలక ఉద్యోగులు ర్యాలీ, దీక్షలు చేపట్టారు.
అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీఎన్‌జీవో, రెవెన్యూ, జాక్టోల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వెయ్యి బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. ఎస్కేయూ, జేఎన్టీయూలో విద్యార్థులు, అధ్యాపకుల దీక్షలు కొనసాగిస్తున్నారు. నేడు పుట్టపర్తిలో సమైక్య భేరి నిర్వహించనున్నారు. రాయదుర్గంలో బంద్‌కు పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లాలో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నందికొట్కూరు, ఆత్మకూరు, ఎమ్మిగనూరులలో వైఎస్ఆర్ సీపీ దీక్షలు చేపట్టింది. కర్నూలులో న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పాలిటెక్నిక్ సిబ్బంది, నీటిపారుదల ఉద్యోగులు, మార్కెట్‌యార్డ్, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు చేస్తున్నారు. నంద్యాలలో ఎన్జీవో, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవడంతో కర్నూలు జిల్లా రీజియన్‌కు రూ.50 కోట్ల నష్టం వాటిల్లింది.