అవిభజనమస్తు
Published Mon, Sep 9 2013 3:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
సాక్షి నెట్‌వర్క్: సర్వవిఘ్నాలను తొలగించి శుభాలు చేకూర్చే ఆ విఘ్నేశ్వరుడుని సీమాంధ్రప్రజ ఈ వినాయకచవితి పర్వదినాన వ్యక్తిగత ఆకాంక్షలు పక్కనపెట్టి రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలంటూ ప్రార్థిస్తోంది. సోమవారం నుంచి మొదలయ్యే గణేశచతుర్ధి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వాడవాడలా ప్రతిష్టించిన ప్రతిమల వద్ద రాష్ట్రంలో వేర్పాటువాదం పోవాలంటూ సమైక్యవాదులు మొక్కుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఉపాధ్యాయులు వినాయకుని విగ్రహాల వద్ద మోకరిల్లి విభజనపై సోనియాగాంధీ మనసుమార్చమని ప్రార్థించారు. కనిగిరిలో క్రైస్తవ సంఘం ర్యాలీ చేపట్టింది. వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి సంఘీభావంగా ఒంగోలులో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మోటారుబైక్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో జేఏసీ నేతలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ వినాయకుడి మట్టి ప్రతిమలను ఉచితంగా పంచిపెట్టారు. వైఎస్సార్ సీపీ నేత పి.గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌టీఎస్ రోడ్డుపై వినాయకుడికి పూజలు నిర్వహించారు.
కడపలో అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీఆర్వో ఈశ్వరయ్య, నగరపాలకసంస్థ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీవో వీరబ్రహ్మయ్యతో పాటు గ్రూప్-1 అధికారుంతా ఆదివారం కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: వాకాడు అశోక్ స్తంభం కూడలిలో భవననిర్మాణ కార్మికులు రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై రాతిగోడను కట్టి నిరసన తెలిపారు. విజయనగరంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, జేఏసీ ప్రతినిధులు విజయనగరంలోని మయూరి జంక్షన్‌లో బైఠాయించి కళ్లకు, చెవులకు, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని రాష్ట్ర విభజన ప్రక్రియను చెడుగా అభివర్ణిస్తూ చెడు కనకు, వినకు, మాట్లాడకు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇందిరానగర్ వద్ద రహదారిపై టైర్లుకాల్చి సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు అనంతపురం నగరంలో కదం తొక్కారు. ముస్లిం మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది సుభాష్ రోడ్డులో శాంతి ర్యాలీ నిర్వహించారు.
టవర్‌క్లాక్ వద్ద మానవహారం నిర్మించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు భిక్షాటన చేశారు. కొత్తపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. గోపాలపురంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మానవహారం ఏర్పాటు చేశారు. నల్లజర్ల మండలం నబీపేటలో అమ్మవారికి పూజలు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గ్రామస్తులు వేడుకున్నారు. కొవ్వూరులోబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై హోమాలు నిర్వహించారు. అత్తిలిలో స్టేట్ హైవేపై గంగిరెద్దులతో విన్యాసాలు చేయించారు. తిరుపతిలో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు నడిరోడ్డుపై షామియానా వేసి భక్తి సంగీత విభావరి నిర్వహించి, వినూత్న రీతిలో నిరసన తె లిపారు. బెరైడ్డిపల్లెలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినాయకునికి వినతిపత్ర ం సమర్పించారు. పుంగనూరులో ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. చంద్రగిరిలో సమైక్యవాదులు రోడ్డుపై యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఉపాధ్యాయులు వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని మొక్కుకున్నారు.
చేనేతకార్మికుల మానవహారం
శ్రీకాకుళం: అంపోలులో చేనేత కార్మికులు జాతీయ రహదారిపై మానవహారం నిర్మించి, రోడ్డును దిగ్బంధించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, నాయకుల మనసు మారాలని కోరుతూ శ్రీకాకుళం పట్టణంలో ఉపాధ్యాయులు గాయత్రీ దేవికి హోమం నిర్వహించారు. పాలకొండలో సర్వే, గణాంకశాఖల ఉద్యోగులు రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన తెలిపారు. కవిటిలో రజకులు రోడ్డుపైనే బట్టలు ఉతికి నిరసన తెలిపారు.
సమైక్యగళార్చన
కర్నూలు: డోన్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా రెడ్డి సామాజికవర్గ నాయకులు నిర్వహించిన సమైక్యగళార్చనలో దాదాపు 5వేల మంది పాల్గొని మార్కెట్‌యార్డు నుంచి కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆళ్లగడ్డ పట్టణంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు శోభానాగిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. సమైక్యవాదులపై దాడికి నిరసనగా ఉద్యోగ జేఏసీ నాయకులు జాతీయ రహదారిలో తెలంగాణవాసులకు పూలు ఇచ్చిన నిరసన తెలిపారు.
రోడ్డుపైనే దుస్తులు ఉతికి రజకుల నిరసన
గుంటూరు: మంగళగిరిలో రజక వృత్తిదారులు రహదారులపై బట్టలు ఉతికి నిరసన తెలిపారు. సత్తెనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు రోడ్డుపై వెళ్లే వాహనాలు శుభ్రం చేసి నిరసన తెలిపారు. మాచర్ల పట్టణంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రహదారిపై యజ్ఞయాగాదులు నిర్వహించారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కాంక్షిస్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి బ్రాహ్మణులు చెన్నకేశవస్వామికి వినతి పత్రం అందజేశారు.
17న ‘విశాఖ సమైక్యాంధ్ర గర్జన’
విశాఖలో ఆదివారం మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశంలో ఈనెల 17న నగరంలో 5లక్షల మందితో విశాఖ సమైక్యాంధ్ర గర్జన పేరిట సభ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలోని వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసే యత్నాలకు నిరసనగా ఏయూ విద్యార్థులు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఒంటికాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
విభజన భయంతో మరో ఐదుగురి మృతి
రాష్ట్రాన్ని విభజిస్తారన్న భయంతో మరో ఐదుగురు తదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం సుభలయ గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థి వాకాడ చంద్రశేఖర్(15) శనివారం రాత్రి టీవీలో సమైక్యాంధ్ర ఆందోళన వార్తలు చూసి రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు రావని చెబుతూ మరణించాడని మృతుని తాత అప్పారావు చెప్పారు. విద్యార్థి తల్లిదండ్రులు చైన్నైలో వలసకూలీలుగా పనిచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పొల్గొంటున్న చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం రాయపేడు నివాసి చవరంబాక్కం వెంకటేష్ (38), అనంతపురం జిల్లా అమడగూరు మండల కేంద్రానికి చెందిన నరసింహప్ప(55), పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెంకు చెందిన దూది పాండు రంగారావు (40) ఆదివారం, నిడమర్రు మండలం దేవరగోపవరానికి చెందిన కూలి సత్యనారాయణ (40) శనివారంఅర్ధరాత్రి దాటాక గుండెపోటుతో మృతిచెందారు.
Advertisement
Advertisement