సమైక్యాంధ్ర@: వైఎస్‌ఆర్
Published Mon, Sep 16 2013 4:06 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ :సమైక్యవాదానికి వైఎస్‌ఆర్ కుటుంబం కేరాఫ్‌గా నిలిచిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరకు సమైక్య నినాదంతో ముందుకు సాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే మూడు ప్రాంతాలకు చెందినవారి మనోభావాలు తీసుకోవాలని 2009లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని బాలాజీ వివరించారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ సమైక్య వాదానికే కట్టుబడి ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, గాదె వెంకటరెడ్డిలు వైఎస్ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నారని అనేకమార్లు స్పష్టం చేశారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోరుతూ పార్లమెంటులో ప్ల కార్డు పట్టుకొని నినాదాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జైలులో ఉండి కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నిరవధిక నిరాహారదీక్ష చేశారన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిరవధిక నిరాహారదీక్ష చేశారన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులంతా రాజీనామా చేశారని చెప్పారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుస్తున్న చంద్రబాబు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చారన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అంటూ ఏముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారని నూకసాని ప్రశ్నించారు. 2008 అక్టోబర్ 18వ తేదీన రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారన్నారు. సమైక్యవాదివో, విభజనవాదివో స్పష్టం చేసి ఆత్మగౌరవయాత్ర నిర్వహించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.
ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది కాదా?
రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది కాదా అని నూకసాని బాలాజీ ప్రశ్నించారు. ఉద్యమం మీడియా సృష్టి అని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. కేంద్ర మంత్రులు సీమాంధ్ర ప్రజల డిమాండ్‌ను పక్కనపెట్టి పదవుల కోసం చూర్లు పట్టుకొని వేలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒకవైపు సోనియాగాంధీకి అనుకూలంగా ఉంటూ, ఇంకోవైపు తాము సమైక్యవాదులం అంటూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు.
సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసి బయటకు రాకపోవడంతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని నూకసాని బాలాజీ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ(బుజ్జి), గ్రామీణ ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, నాయకులు ముదివర్తి బాబూరావు, తోటపల్లి సోమశేఖర్, పొగడ్డ చెంచయ్య, ఎస్సీ సెల్ నగర కన్వీనర్ యరజర్ల రమేశ్, ఎస్‌వీ రమణయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement