
సోనియాకు వినపడేలా 'జై సమైక్యాంధ్ర'
చిత్తూరు: ఢిల్లీలో ఉన్న యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులకు వినిపించేలా నినాదాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సభికులకు పిలుపు ఇచ్చారు. జగన్ పిలుపుతో చిత్తూరు జిల్లా రాయల్పేట్లో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎగువ ప్రాజెక్టులు నిండితే తప్ప దిగువకు నీరు రాని పరిస్థితి అని తెలిపారు. జై సమైక్యాంధ్ర, జై తెలుగుతల్లి, జై వైఎస్ఆర్ అని నినాదాలు చేశారు. జనం బిగ్గరగా నినాదాలు చేశారు. రెండో విడత సమైక్య శంఖారావంలో భాగంగా జగన్ ఈరోజు రాయల్పేట్ గ్రామం చేరుకున్నారు. జగన్ వస్తున్నారని తెలిసి అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామంలో ఎటు చూసినా జనమే జనం. మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి.
అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ఎగువ ప్రాజెక్టులు నిండిన తరువాతే దిగువకు నీరు వస్తుందని తెలిపారు. విభజన జరిగితే రాష్ట్రం ఏడారవుతుందని హెచ్చరించారు. రైతుల గురించి ఆలోచించే పరిస్థితిలేదని బాధపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో 50 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుందాని తెలిపారు. చంద్రబాబు నోట సమైక్య మాట రాదన్నారు. ప్రజాగర్జనలో చంద్రబాబు ఏం మాట్లాడతారు? అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికలలో తెలుగువాడి సత్తా చాటుదామని జగన్ అన్నారు. 30 లోక్సభ స్థానాలను గెలుచుకుందామని చెప్పారు.
అంతకు ముందు పెందపంజాని మండలం నేలపల్లె గ్రామంలో జగన్ చెరకు రైతులను కలిశారు. వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాగానే చెరకు రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని వారికి హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర ప్రకటించిన తరువాతే క్రషింగ్కు అనుమతిస్తామని చెప్పారు.