పోడియం వద్దకు దూసుకెళ్లిన వైఎస్ జగన్
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా మరోసారి సమైక్యవాణి వినిపించారు. రాష్ట్ర విభజన ఆపండంటూ ఫ్లకార్డుతో ఆయన పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. స్పీకర్ పోడియం వద్ద పార్టీ ఎంపీలతో కలిసి జగన్ నిరసన తెలిపారు. మరోవైపు తొలిసారిగా సీమాంధ్ర మంత్రులు వెల్లోకి రాగా, సీమాంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు వెల్లోకి దూసుకు వచ్చి పోటా పోటీగా నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. ఇక సీమాంధ్ర సభ్యులు బిల్లు ప్రతులను చింపి ఎగురవేశారు.
కాగా సమైక్యాంధ్ర ఆందోళనల మధ్యే కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే రైల్వే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సభ్యుల ఆందోళనలతో ఖర్గే తన ప్రసంగాన్ని కేవలం పది నిమిషాల్లోనే ముగించారు. మరోవైపు ఖర్గే బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెల్ వద్ద నిరసన తెలియ చేయటం విశేషం.