మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి
నియోజకవర్గ పరిధిలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం
అరకు పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మా తనూజారాణి
సాక్షి,పాడేరు: రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి విశేష సేవలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని అరకు పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మా తనూజారాణి తెలిపారు. బుధవారం పార్వతీపురం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
సీఎంపై నమ్మకాన్ని రుజువు చేసేలా..
నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావడంతో సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రుజువు చేసిందన్నారు. తాను రాజకీయాలకు కొత్త అన్నారు. వైద్యురాలిగా పాడేరు ఐటీడీఏ పరిధిలో తోటి గిరిజనులకు సేవ చేస్తున్నానని తనూజారాణి పేర్కొన్నారు.
తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం..
అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోడలుగా, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్‌కు భార్యగా, తన తండ్రి గుమ్మా శ్యాంసుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నారని.. తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందని తనూజారాణి తెలిపారు.
అనూహ్యంగా అవకాశం..
అనూహ్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అరకు పార్లమెంట్ బరిలో నిలిపి గిరిజనులకు సేవచేసే భాగ్యం కల్పించారన్నారు. ఆయన ఆశయానికి తగ్గట్టుగా గిరిజనులకు సేవ చేస్తానని చెప్పారు. అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని వర్గాల ఓటర్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఆశయంతో ఉన్నారన్నారు. ఆ నమ్మకమే ఎంపీగా, నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు.
ప్రతీ కుటుంబానికి ఆర్థిక లబ్ధి
జగనన్న ప్రభుత్వం అర్హత గల ప్రతీ కుటుంబం పథకాల రూపంలో ఆర్థికంగా లబ్ధిపొందిందన్నారు. భారీ మెజారిటీతో విజయం సాధించి గిరిజన ప్రాంత సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment