పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్ మరో నాటకం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: జనసేన –టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటన చేయడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో.. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేనే పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడం అంతకన్నా హాస్యాస్పదమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
2019 ఎన్నికల్లో పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ, ఒక్క రాజోలులోనే జనసేన గెలిచింది. అలాంటి రాజోలు స్థానంలో జనసేన పోటీ చేయడం ఏమైనా విచిత్రమా? రాజానగరం నియోజకవర్గాన్ని టీడీపీ ఇప్పటికే జనసేనకు వదిలేసింది. పవన్ పోటీ చేస్తున్నట్లు చెప్పింది కూడా ఈ రెండు నియోజకవర్గాలే. ఇక్కడే డ్రామా మొత్తం బయటపడిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. మండపేట, అరకు నియోజకవర్గాలకు చంద్రబాబు ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడానికి కౌంటర్‌గా, గుణపాఠం చెబుతున్నట్లుగా పవన్ ఈ ప్రకటన చేయలేదన్నది సుస్పష్టమని అంటున్నారు. కేవలం పార్టీ నేతలు, అభిమానుల ముందు బిల్డప్ ఇవ్వడానికే పవన్ రెండు నియోజకవర్గాలపై ఈ హాస్యాస్పద ప్రకటన చేశారని, దీని వెనుకా చంద్రబాబే ఉన్నారని రాజకీయ పరిశీలకులు, జనసేన నేతలు కూడా చెబుతున్నారు.
టీడీపీ – జనసేనల మధ్య పొత్తు ఖరారై నాలుగు నెలలు దాటింగి. ఇప్పుటికీ రెండు పార్టీల మధ్య సీట్ల గొడవ సాగుతూనే ఉంది. సీట్ల కేటాయింపుపై బాబు–పవన్ ఉమ్మడిగా ప్రకటన చేయాలని ఇప్పటికి రెండుసార్లు నిర్ణయించి, విఫలమయ్యారు. ఇంకో పక్క మా సీటు మీరెలా అడుగుతారంటూ నియోజకవర్గాల్లో టీడీపీ –జనసేన నాయకులు గొడవలు పడుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ తేలకపోయినప్పటకీ మండపేట, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్టు ఆ రెండు చోట్లా సభలు పెట్టి మరీ చెప్పారు. అభ్యర్థులను కూడా ఆ సభల్లోనే ప్రకటించారు.
బాబు తీరుపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా మండపేట నేతలు పవన్‌ను కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ శుక్రవారం నాటి ప్రకటన చేశారని చర్చ సాగుతోంది. సీట్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం, టీడీపీ ఏకపక్ష వైఖరి కారణంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య పెద్దస్థాయిలో నెలకొన్న విభేదాలను తగ్గించి, అన్ని చోట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేన ఓట్లు టీడీపీకి బదలాయించడం కోసమే బాబు, పవన్ వ్యూహాత్మకంగా ఈ నాటకాన్ని మొదలుపెట్టి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. దీనికి ‘టిట్ ఫర్ టాట్’గా కలరింగ్ ఇవ్వడం ఆ ఇద్దరికే
చెల్లిందంటున్నారు.
పొత్తులకు ఎన్నెన్ని ఎత్తులో..
నమ్మించి నట్టేట ముంచడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును పవన్ విశ్వసిస్తున్నారని జనసేన నేతలూ నమ్మడంలేదు. పొత్తుల కోసం మొదటి నుంచి వెంపర్లాడుతూ మరోవైపు అలాంటిదేమీ లేదన్నట్లు బాబు, పవన్ చెబుతూ వచ్చారు. ఈ డ్రామాను ఇరు పారీ్టల వారితో పాటు రాష్ట్ర ప్రజలూ ఏ దశలోనూ విశ్వసించలేదు. ఈ దశలోనే స్కిల్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ములాఖత్ మాటున పవన్ పొత్తు ప్రకటనా నాటకమన్న విషయం అప్పట్లోనే తేటతెల్లమైంది.
బాబు అరెస్టుతో టీడీపీ పనైపోయిందని, పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ అత్యధిక సంఖ్యలో సీట్లను కేటాయించే అవకాశం ఉందని నమ్మి ఆ పార్టీ నాయకులు కూడా కలిసిపోయేందుకు రెడీ అయ్యారు. జనసేన 68 సీట్లను టీడీపీ ముందు ప్రతిపాదించి, కనీసం 45 స్థానాల్లో పోటీ చేయాలని ఆశపడుతోంది. అందులో సగం సీట్లు కూడా జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదని చర్చ సాగుతోంది. క్రమంగా టీడీపీ ముసుగు తొలగి, మోసపూరిత వైఖరి బయట పడుతుండటంతో జనసేన నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వారంతా చంద్రబాబు, టీడీపీ మోసపూరిత వైఖరి గురించి మాట్లాడుతుంటే.. జనసేన అధినేత పవన్ మాత్రం సర్దుకుపోవాలన్న మాటలే వినిపిస్తున్నారు. పొత్తులో ఎలాంటి పరిస్థితులు ఉన్నా జనసేన సర్దుకపోవాల్సిందేనని, భరించాల్సిందేనని సొంత పార్టీ నేతలకు పదేపదే చెబుతున్నారు. శుక్రవారంనాటి సమావేశంలోనూ.. ముందుగా రెండు నియోజకవర్గాలపై ఓ బిల్డప్ ప్రకటన చేసి, చివరికి వచ్చేసరికి సర్దుకుపోవాల్సిందేనన్న టీడీపీ సందేశాన్నే ఇచ్చారు. సీట్ల కేటాయింపు తేలక మునుపే చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్ధులను ప్రకటించడంపై సొంత పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతూనే.. వాళ్ల పార్టీలో ఉన్న పరిస్థితిని మనమే అర్ధం చేసుకోవాలంటూ చంద్రబాబుకు వంతపాడారు.
సీఎం పదవి లేదన్నలోకేశ్కూ జీ హుజూరే!
టీడీపీ –జనసేన పొత్తు ఉన్నప్పటికీ, సీఎం పదవిలో పవన్ కళ్యాణ్‌కు వాటా లేదంటూ గతంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు సైతం తాజాగా జనసేన అధినేత జీహుజూర్ అనేశారు. నెల కిత్రం లోకేశ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాలా స్పష్టంగా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో సెకండ్ థాట్ (రెండో మాటే లేదు)’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో జనసేన పారీ్టలో పెద్ద దుమారమే రేగింది. ఇన్నాళ్లూ దానిపై ఒక్కసారి కూడా మాట్లాడని పవన్.. శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో స్పందించారు. పెద్ద మనస్సుతో ఆ వ్యాఖ్యలను తానే పట్టించుకోకుండా వదిలేశానని వివరించారు. 2024లో జగన్ ప్రభుత్వం రాకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటన్నింటికీ నన్ను చాలా సార్లు రెస్పాండ్ కానీయకుండా చేస్తోందంటూ వంకలు చెప్పారు.
ఎమ్మెల్యే సీట్లను పక్కనపెట్టి.. వార్డు పదవుల వాటా చర్చ
రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ టీడీపీ కేటాయిస్తుంది, సీఎం పదవిలో వాటా ఉంటుందా అని జనసేన నేతలు ఉత్కంఠతో ఉంటే.. పవన్ మాత్రం వీటి ఊసెత్తకుండా ఎప్పుడో రెండు మూడేళ్ల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకిన్ని సీట్లు వస్తాయంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్లెన్ని వస్తాయో చెప్పకుండా.. ఈ ఎన్నికల తర్వాత కామన్ పొలిటికల్ ప్రోగ్రాం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మొదలు కార్పోరేషన్ వరకు జనసేన ఖచి్చతంగా మూడో వంతు సీట్లను తీసుకుంటుందంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
కేవలం ఎమ్మెల్యే సీట్ల దగ్గర తాను ఆగిపోవడం లేదంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చంద్రబాబు ఏమిటో తెలిసిన జనసేన నేతలు పవన్ మాటలను నమ్మడంలేదు. ఇదంతా అసెంబ్లీ సీట్ల కేటాయింపుల వ్యవహారం నుంచి జనసేన నేతలు, అభిమానులను పక్కదారి పట్టించే ప్రయత్నమేనని, చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. చివరివరకు ఇలా సాగదీసి, ఎన్నికల ముంగిట్లో ఓ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు విదిలిస్తారన్నది సుస్పష్టమని చెబుతున్నారు. కేవలం జనసేన ఓట్లు టీడీపీకి పడటానికే చంద్రబాబు ఇలా జనసేన నేతలు, అభిమానులకు పవన్‌తో చెప్పిస్తున్నారని విశ్లేíÙస్తున్నారు.