విశాఖపట్నం: అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సమన్వయ పర్చేందుకు ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటుచేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. అరకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు అరుణకుమారి, పెదబయలు మండల మాజీ ఎంపీపీ జర్శింగి సూర్యనారాయణ, హుకుంపేట మండలానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు పోయా రాజారావులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక నుంచి అరుకు నియోజకవర్గ పరిధిలో పార్టీపరంగా జరిగే కార్యక్రమాలన్నింటిని ఈ త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఫ్యాన్ గుర్తుపై గెలిచి పార్టీకి.. ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడుస్తూ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ ఫిరాయించినప్పటికీ పార్టీ క్యాడర్ ఎక్కడా చెక్కుచెదరకుండా తామంతా వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నానని తేల్చిచెప్పారు. కిడారి వెళ్లినంత మాత్రాన పార్టీకి జరిగిన నష్టం ఏమీ లేదని, గిరిజనులంతా వైఎస్సార్ సీపీకి అండగానే ఉన్నారని ఇటీవల పార్టీ పిలుపు మేరకు జరిగిన కార్యక్రమాల ద్వారా రుజువు చేశారు. పార్టీ క్యాడర్‌లో నూతనోత్తేజం నింపేందుకు కిడారి పార్టీ ఫిరాయించిన మరునాడే జిల్లా పార్టీ నేతలంతా అరుకు వెళ్లి కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపారు. ఆ తర్వాత పార్టీ ఇచ్చిన ప్రతీ పిలుపునకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండృలాల్లోనూ పార్టీశ్రేణులు స్పందిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిని సమన్వయపర్చే లక్ష్యంతో పార్టీ అధినాయకత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.