తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 40వ రోజుకు చేరుకుంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వోద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారులు, కూలీలు, మహిళలు ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. సోమవారం వినాయకచవితి పండుగ ఉండడంతో ఒక వైపు పండుగ ఏర్పాట్లు చేసుకుంటూనే ఆదివారం యథావిధిగా ఉద్యమం కొనసాగించారు. హైదరాబాద్‌లో శనివారం ఏపీఎన్జీవోలు నిర్వహించిన సమైక్య గర్జన (సేవ్ ఆంధ్రప్రదేశ్) సభ విజయవంతమైన నేపథ్యంలో పలు పట్టణాలలో హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన జేఏసీ నాయకులకు ప్రజలు నీరాజనాలు పట్టారు.
కొన్నిచోట్ల వినాయక విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి సమైక్యాంధ్రకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మనసు మారేలా చూడాలని మొక్కుకున్నారు. తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు, ఏపీఎన్జీవోలు, విద్యార్థి జేఏసీ నాయకులు దీక్షలు యథావిధిగా కొనసాగించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు నడిరోడ్డుపై షామియానా వేసి భక్తి సంగీత విభావరి నిర్వహించి, వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్జీవో జేఏసీ నాయకులకు పలమనేరులో అభినందనసభ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
బెరైడ్డిపల్లెలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినాయకునికి వినతిపత్ర ం సమర్పించారు. వి.కోటలో జేఏసీ నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు. పుంగనూరులో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఎంబీటీ సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించారు. మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులకు తిలకం దిద్ది, సమైక్యాంధ్ర కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రిలే దీక్షలు యథావిధిగా కొనసాగాయి. పట్టణంలోని రెండు థియేటర్లలో తుఫాన్ సినిమా ప్రదర్శనను నిరసన కారులు అడ్డుకున్నారు. పోస్టర్లను చించేశారు. మదనపల్లెలో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రిలే దీక్షలు కొనసాగాయి.
సాయంత్రం గోల్డన్ వ్యాలీ విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. చంద్రగిరిలో జేఏసీ దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. సమైక్యవాదులు రోడ్డుపై యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఉపాధ్యాయులు వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. పుత్తూరులో ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. పీలేరులో సమైక్య ఉద్యమం 32వ రోజుకు చేరింది. నిరసనకారులు క్రాస్‌రోడ్‌లో మోకాళ్లపై నిలబడి వెనక్కు నడిచి నిరసన తెలిపారు. చిత్తూరులో క్రైస్తవ సోదరులు మానవహారం ఏర్పాటు చేశారు. విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, మానవహారం ఏర్పాటు చేశారు.
సమైక్యపోరుకు 40 రోజులు
Published Mon, Sep 9 2013 3:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement