సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వర్ష బీభత్సం వారి ‘సమైక్యాంధ్ర’ ఆకాంక్షను నీరుగార్చలేకపోయింది. ఇళ్లు, పొలాలను ముంచెత్తిన వరద వారిని సమైక్యాంధ్ర ఉద్యమపథం నుంచి పక్కకు మళ్లించలేకపోయింది. అందుకే.. ప్రకృతి ప్రకోపాన్ని కూడా లెక్క చేయకుండా భావితరాల బాగు కోసం.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం సమష్టిగా హైదరాబాద్ వైపు కదం తొక్కారు. జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, సమైక్యవాదులు హైదరాబాద్‌లో శనివారం నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు భారీగా తరలివెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు వేలాదిగా హైదరాబాద్‌కు పయమయ్యారు. సమైక్యవాదులతో కిటకిటలాడుతూ ప్రత్యేక రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలు రాష్ట్ర రాజధాని బాట పట్టాయి. జిల్లా కేంద్రం నుంచి ఒంగోలు చిట్టచివరన ఉన్న యర్రగొండపాలెం వరకు ప్రతి చోటా ఇదే దృశ్యం కనిపించి సమైక్యాంధ్ర ఆకాంక్షను ప్రతిబింబించింది.
ప్రత్యేక రైళ్ల కిటకిట
వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్య శంఖారావం సభ కోసం జిల్లా నుంచి మూడు ప్రత్యేక రైళ్లు వేశారు. ఇలా జిల్లా నుంచి ఓ సభకు ప్రత్యేకంగా రైళ్లు వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన ప్రత్యేక రైలు ఒంగోలులో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బయల్దేరింది. వేలాదిగా చేరుకున్న పార్టీ శ్రేణులతో ఒంగోలు రైల్వే స్టేషన్ సందడిగా మారింది. అందరూ జై సమైక్యాంధ్ర.. జై జగన్ అని నినాదాలు చేస్తూ ప్రత్యేక రైల్లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. గిద్దలూరు సమన్వయకర్త ముత్తముల అశోక్‌రెడ్డి అక్కడి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడుతూ ఆ రైలు హైదరాబాద్ బయలుదేరింది. చీరాల పార్టీ సమన్వయకర్త యడం చిన రోశయ్య అక్కడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు వేశారు. సమైక్యవాదలతో కిటకిటలాడుతూ రాజధానికి పయనమైంది.
కిక్కిరిసిన వాహనాలు
ఇక సమైక్య శంఖరావం సభకు జిల్లా నుంచి వందలాది బస్సులు, ఇతర వాహనాల్లో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. జిల్లా నుంచి దాదాపు 600 బస్సులు, దాదాపు వెయ్యి వరకు ఇతర వాహనాల్లో రాజధానికి వెళ్లడం విశేషం. ఒంగోలు నుంచి 100 బస్సులు, మరో 150 వాహనాల్లో బయలుదేరారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రాత్రి 10 గంటలకు ఈ వాహనాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌కు పయనమయ్యారు. సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి 65 బస్సులు, 100కుపైగా వాహనాల్లో వెళ్లారు. అద్దంకి నుంచి 75 బస్సులు, 120 వాహనాల్లో బయలుదేరారు.
పర్చూరు నుంచి 50 బస్సులు, 170 వరకు ఇతర వాహనాల్లో సమైక్యవాదులు రాజధానికి పయనమయ్యారు. కందుకూరు నుంచి 35 బస్సులు, దాదాపు 100 వాహనాల్లో వెళ్లారు. దర్శి నుంచి 45 బస్సులు, 100 వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. కనిగిరి నుంచి 38 బస్సులు, 120 వాహనాల్లో వెళ్లారు. మార్కాపురం నియోజకవర్గం నుంచి 60 బస్సులు, 100 వాహనాల్లో పయనమయ్యారు. యర్రగొండపాలెం నుంచి 40 బస్సులు, 40 వాహనాల్లో వెళ్లారు. కొండపి నియోజకవర్గం నుంచి 20 బస్సులు, 60 వాహనాల్లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. చీరాల, గిద్దలూరుల నుంచి రైళ్లు కాకుండా అదనంగా మరో 120 వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా శనివారం తెల్లవారు జామున మరికొన్ని బస్సులు, ఇతర వాహనాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఇంత భారీ సంఖ్యలో జిల్లా నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో కిటకిటలాడుతూ రాజధాని బాటపట్టడంతో ఇదే తొలిసారి. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లా అంతటా సమైక్య శంఖారావం వాహనాలతో సందండి సందడిగా మారింది. జిల్లా సమైక్యాంధ్ర స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పింది.
రాజధానికి వేలాదిగా తరలిన సమైక్యవాదులు
Published Sat, Oct 26 2013 5:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement