19న హైదరాబాద్లో జగన్ సమైక్యశంఖారావం
సమైక్యాంధ్రను కోరుకుంటూ మొదటి నుంచీ అనేక పద్ధతుల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్‌లో సమైక్యశంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ నెల 2 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఈ పార్టీ వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్ర రాజధానిలో నిర్వహించే సమైక్యశంఖారావం ద్వారా సమైక్యరాష్ట్రం ఆకాంక్షను బలంగా వినిపించనున్నది. విభజన, సమైక్యవాదులందరూ సహకరించి తమ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రం విడిపోతే భవిష్యత్ అధోగతేనంటూ ప్రజలు ఎదుర్కొనే విభజన సమస్యలను పార్టీ పదే పదే కేంద్రానికి వివరిస్తోంది. ఇదే అంశంపై హైదరాబాద్‌లో సమైక్యశంఖారావం పేరిట భారీ సమావేశం నిర్వహించనున్నట్లు నిన్న జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అయినందున ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. విభజనవాదులు, సమైక్యవాదులు సహకరించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్, టిడిపిలు కలిసి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో, జైలు నుంచే జగన్ నిరాహారదీక్షలు చేసి తీవ్రస్థాయిలో తమ నిరసనను తెలిపారు. సమైక్య స్ఫూర్తిని చాటుతూ షర్మిల బస్సుయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, విభజనను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఉధృత స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.